రేపు ఎస్కేఎం జాతీయ సదస్సు

రేపు ఎస్కేఎం జాతీయ సదస్సు– డిమాండ్ల సాధన కోసం జలంధర్‌లో నిర్వహణ
– ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభం
– 12 కోట్ల కుటుంబాలతో నిమగమవ్వాలని లక్ష్యం
న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) ఈనెల 16న జలంధర్‌లో తన జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సమావేశానికి సంబంధించిన ప్రాథమిక అజెండాలో కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కోసం పోరాటానికి తదుపరి దశలను ప్లాన్‌ చేయటం, అన్ని బ్యాంకింగ్‌ సంస్థల నుంచి ఒకేసారి రుణమాఫీ, విద్యుత్‌ (సవరణ) చట్టం ద్వారా విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణను వ్యతిరేకించటం వంటివి ఉన్నాయి.
లఖింపూర్‌ ఖేరీలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు హత్య కేసులో హస్తమున్న తన కుమారుడు ఆశిష్‌ మిశ్రాను రక్షించటంలో పాత్ర పోషించినందుకు కేంద్ర హౌం వ్యవహారాల సహాయ మంత్రి అజరు మిశ్రాను సస్పెండ్‌ చేయాలని ఎస్కేఎం డిమాండ్‌ చేసింది. రైతుల డిమాండ్లపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు దాదాపు 12 కోట్ల కుటుంబాలతో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో ఎస్కేంఎం ఇప్పటికే ఇంటింటికి చేరుకునే ప్రచారాన్ని ప్రారంభించింది.
ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించేందుకు కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం, రైతు సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పుడు రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలను సమర్థించిన మార్కెట్‌ అనుకూల నిపుణులను చేర్చిన తర్వాత ప్యానెల్‌లో భాగం కావటానికి వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని సంఘాలు గతంలో తిరస్కరించాయి.
2021, డిసెంబర్‌ 9న మోడీ ప్రభుత్వ లిఖితపూర్వక హామీతో.. 2021 నవంబర్‌ 26న ఢిల్లీ సరిహద్దుల్లో 735 మంది రైతులు అమరులైన 13 నెలల చారిత్రక రైతాంగ పోరాటాన్ని రైతులు ఆపేశారని ఎస్కేఎం వివరించింది. ”పూర్తి రెండు సంవత్సరాలు గడిచాయి. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టేందుకు ‘మోడీ కా గ్యారంటీ’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రధానికి ఎంఎస్‌పీతో సహా రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయనందున కేంద్రానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎమ్‌ఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసిన చట్టపరమైన హామీతో అన్ని పంటలకు, రైతులు, రైతు కార్మికుల రుణాలను మాఫీ చేయాలి. విద్యుత్‌ ప్రయివేటీకరణను, పొలాలు, రైతుల ఇండ్లకు స్మార్ట్‌ మీటర్లను పెట్టడం ఆపాలి” అని పేర్కొన్నది. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కార్పొరేట్‌ లాభాదాయకత కోసమేనని వివరించింది.