వాళ్లు అలా మాట్లాడటం ఆశ్చర్యం అనిపించదు. వాళ్లలానే మాట్లాడుతారు. కానీ అశేష భారత ప్రజలు వాటినంగీకరించరు. న్యాయము, చట్టము, రాజ్యాంగము, ప్రజాస్వామ్య వ్యవస్థా ఏవీ కూడా ఒప్పుకోవు! అయినా వాళ్ల చరిత్ర పుట్టుక తెలిసిన వాళ్లకు ఈ మాటలు కొత్తేమీ కాదు. ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ, ఒక్కొక్క ప్రజాస్వామిక సంస్థనీ తొక్కుకుంటూ ఇపుడు స్వాతంత్య్రం, రాజ్యాంగం మీదకీ వచ్చేస్తున్నారు. ఇప్పుడీ అనాగరిక సంభాషణలను నిర్భయంగా పలుకుతున్నారు. నిలువరించి, నిలేయకపోతే ఎంతకైనా తెగించే అవకాశమూ ఉంది. జాగరూకులమై ఉండాలి మనమిప్పుడు. లేకుంటే ప్రమాదం వెన్నంటుతుంది.
స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి ఐదేండ్లయిన సందర్భంగా ఆజాదీ అమృత మహౌత్సవాలు జరుపుకుని నడుస్తున్న వేళ, ఇది స్వాతంత్య్రమేకాదని గుర్తించ నిరాకరించడం ఈ దేశభక్త నాయకునికి ఎలా సాధ్యమయింది! ఈ మధ్య రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అధిపతి మోహన్ భగవత్ మాట్లాడుతూ దేశానికి 1947 ఆగస్టు 15న వచ్చింది అసలు స్వాతంత్య్రం కాదని, 2024 జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన తోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నాడు. అంతేకాదు, రాముడు, కృష్ణుడు, శివుడు కేవలం దేవుళ్లే కాదు, మన నాగరికతా విలువలకు, సనాతన ధర్మానికి గుర్తులు అని బోధించారు. రెండు విలువల మధ్య యుద్ధం జరిగి విజయం పొందిన సందర్భం అని సెలవిచ్చారు. ఇది అత్యంత దారుణమైన విషయం. రాముడు, కృష్ణుడు, శివుడు ఇంకా ముప్పది మూడు కోట్ల దేవుళ్లు ఉండవచ్చు గాక, వారిని విశ్వాసాల మేరకు ఆరాధించనూవచ్చు. కానీ వారికి గుడులను నిర్మించడానికి, విగ్రహాలు ప్రతిష్టించడానికీ, మన దేశ స్వాతంత్య్రానికి ముడివేయటం అసంబద్ధమైన వాదం మాత్రమే. ఒక దేవుని గుడిని కూలగొట్టి, మరో దేవునికి గుడి కట్టడం స్వాతంత్య్రం ఎలా అవుతుంది! అంతేకాదు, ఈ వాదన మనం ఇంతకాలంగా అనుభవిస్తున్న స్వేచ్ఛను, ఆధునిక ప్రజాస్వామిక విధానాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేసినట్టేకదా! రెండువందల యేండ్ల ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రజలు పోరాడిన చరిత్రనంతా చులకన చేయటం వారికే చెల్లింది. ఎంతోమంది యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. ప్రాణాలిచ్చారు. ఉరికంభాలెక్కారు. ఆఖరికి స్వేచ్ఛను సాధించారు. ఎలాంటి పాలన కావాలో ఆలోచించి ప్రజాస్వామిక విలువలతో కూడిన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటినీ ఒక్కమాటతో తిరస్కరిస్తారా! ప్రాణత్యాగాలను విస్మరించి, స్వాతంత్య్రాన్నే కించపరుస్తారా!
అవును, మీరు రాజుల కాలంనాటి బానిస భావాల వారసులు. నేటి ఆధునిక ప్రజాస్వామిక విలువలంటే చిర్రెత్తుకొస్తారు. మనుధర్మం తప్ప రాజ్యాంగమంటే మీకు ద్వేషం. మొన్న మొన్నటి వరకూ మన మూడు రంగుల జెండాను కూడా ఎగరేయడానికి పూనుకోలేదు కదా! ఎందుకెగరేస్తారులే! అసలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటే కదా! కాదు కాదు, ఆ పోరాటానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వంతపాడిన వారసులు మీరనే విషయం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాం. పోరాడటం, త్యాగం చేయటం మీకు గిట్టని విషయం. ఒక్కసారి చరిత్రను చూడండి. లక్షలాది మంది ప్రజలు కుల, మత, ప్రాంత భేదాలేవీ లేక ఐక్యంగా పోరాడి పొందిన ఫలితాన్నే ఈ భగవత్, వారి వారసులూ అనుభవిస్తున్నారు. చరిత్రనూ తొక్కేయాలని చూస్తున్నారు. భిన్నమతాల వారు వీరులుగా పోరాడి మనకు స్వాతంత్య్రాన్ని ఇచ్చిపోయారు. మీరేమో మతతత్వ కళ్లతో చూసి మాట్లాడుతున్నారు. పాశ్చాత్య దేశాల ఫాసిస్టు ఉద్యమాల నుండి ప్రేరణ పొందిన సంఘ్ సేవకులు ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛను భరించడం కష్టంగానే ఉంటుంది మరి! స్వేచ్ఛ కోసం జరిగిన సమరంలో అసలు పాల్గొనని వారి మాటలు ఇంతకన్నా గొప్పగా ఏం ఉంటాయి. చెప్పుకోవటానికి సచ్చరిత్రే లేనివాళ్లు హీనులుగా మిగిలిపోకతప్పదు.
మోహన్ భగవత్ మాటలు తేలికగా తీసుకుంటే మోసపోతాము. అవి వారి భవిష్యత్ ఆచరణలో భాగంగా చెప్పిన మాటలు. మన రాజ్యాంగాన్ని, దాని విలువలను పక్కనపెట్టి సనాతన ధర్మం పేర మనుధర్మాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలోంచి వచ్చిన మాటలవి. దేశభక్తి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే వీళ్ల అసలు దేశభక్తి ఇది. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని కించపరచడం, దేశ స్వాతంత్య్రాన్ని గుర్తించ నిరాకరించడం వీరి నైజం. ప్రజలు ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. చైతన్యంతో తిప్పికొట్టాలి.