– గతేడాది కన్నా రూ.661 కోట్లు తక్కువ
– ఎనిమిది శాతం కేటాయించాలి నిపుణులు
– నాలుగు శాతం వద్దే ఆగిపోతున్న కేటాయింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు కేటాయింపులు తగ్గాయి. ఆ రంగానికి గతేడాది కన్నా రూ.690 కోట్లు తక్కువగా ఇచ్చారు. వైద్యఖర్చుల పేదలకు భారంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ శాఖకు కనీసం ఎనిమిది శాతం నిధులను కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే గత బీఆర్‌ఎస్ అందుకు భిన్నంగా వ్యవహరించంది. ఆ రంగానికి నిధులు తగ్గించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే రకంగా వ్యవహరించింది. 2014-15 లో 4.1 శాతం, 2015-16లో 3.9 శాతం, 2016-17లో 4.1 శాతం, 2017-18లో 4.2 శాతం, 2018-19 లో 4 శాతం, 2019-20లో 4.3 శాతం, 2020-21లో 3.8 శాతం, 2021-22 లో 3.8 శాతం, 2022-23లో 4.6 శాతం, 2023-24లో 4.3 శాతం నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్‌లో అది కాస్తా 4.16 శాతానికి తగ్గింది. గతేడాది 4.3 శాతంతో దేశంలోని 30 రాష్ట్రాల్లో మన రాష్ట్రం కేటాయింపులపరంగా 29వ స్థానంలో ఉన్నట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. మరోవైపు రాజ్యసభ స్థాయి సంఘం ఆరోగ్య బడ్జెట్‌లలో 66 శాతం ప్రాథమిక వైద్యానికి కేటాయించాలని సూచించింది. కానీ ఇవేవి ప్రస్తుత బడ్జెట్‌లో కనిపించలేదు.
ప్రాధాన్యతల పరంగా కూడా ఈ సూచనను కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంచడం, రేట్లను సవరించేందుకు అంగీకరించడం, ప్రభుత్వాస్పత్రులకు ఏ నెలకు ఆ నెల, ప్రయివేటు ఆస్పత్రులకు మూడు నెలలకు ఒకసారి చెల్లింపులకు అంగీకరించడం తదితరాంశాలకు బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అదే విధంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న పాత 26 మెడికల్ కాలేజీలకు తోడు మరో 6 కొత్త మెడికల్ కాలేజీలు, పాత 17 నర్సింగ్ కాలేజీలతో పాటు కొత్తగా ఆరు కాలేజీలు, నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరణ వంటి ప్రాధాన్యతల రీత్యా ఆరోగ్య బడ్జెట్‌లో సింహభాగం వాటికే వెళ్లే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖకు నిధుల విషయంలో తగు ప్రాధాన్యతనివ్వాలని వైద్యారోగ్యరంగ నిపుణులు కోరుతున్నారు.
కేటాయింపులు పెంచాలి
వైద్యారోగ్యరంగానికి కేటాయిం పులు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదాల సూచించారు. ఢిల్లీలో అత్యధికంగా 12.4 శాతం, గోవాలో 8.7 శాతం, కేరళలో 5 శాతం, తమిళనాడు 4.5 శాతం నిధులను గతేడాది ఆ శాఖకు కేటాయించారని గుర్తుచేశారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీలకు ప్రాధాన్యతని వ్వడం హర్షనీయమనీ, ప్రాథమిక వైద్యానికి కూడా మరింత ప్రాధాన్యత నివ్వాలని కోరారు. – డాక్టర్ కిరణ్ మాదాల