ఎక్కిరిచ్చేటోళ్ల ముందు జారిపడ్డట్టు

ఎక్కిరిచ్చేటోళ్ల ముందు జారిపడ్డట్టుకొందరికి వంకలు పెట్టే గుణం ఎక్కువ ఉంటది. ఎదుటి వాళ్లు ఏ పని చేసినా చేయక పోయినా గాని అందులో రంద్రాన్వేషణ చేస్తారు. తప్పులు దొరకపట్టడమే వాళ్ల పని. అంటే ఎక్కిరిచ్చి
పెడుతరు. వాళ్ల చర్యలు చూసి న్యూనతా భావన చెందితే ఏదో ఒకటి జరుగుతది. అప్పుడు ‘ఎక్కిరిచ్చేటోళ్ల ముందు జారిపడ్డట్టు’ అనే సామెత వాడుతారు. కొసాకరుకు వాల్లు కూడా ఎక్కడో బోర్ల పడతరు అది వేరే సంగతి. ఇటువంటి వాళ్లను ‘ఎందుకొచ్చినవే ఎల్లవ్వా అంటే అందుకు కాదు తియ్యి అగ్గికి వచ్చిన అన్నదట’.
ఈ ప్రశ్న వేసే వాళ్లకు అగ్గి కి కాదు మరి ఎందుకో వచ్చింది అని తెలిసిపోతది. ఒకనాటి కాలంలో పొయ్యి మీద వంట చేయడానికి అగ్గిని నిప్కల రూపంలో పక్క ఇంటి నుంచి తెచ్చుకునేవారు. లోకం మీద రకరకాల మనుషులు ఉంటరు.ఇట్లనే ‘ఎందుకు ఏడుస్తున్నావ్‌ పోరాడా అంటే ఎల్లుండి మా అవ్వ కొడతదట’ వాళ్ల అవ్వ ఎల్లుండి కొడుతా అంటే వాడు ఇవ్వాళ ఏడుస్తన్నడు. ‘ఎవల పిచ్చి వాళ్ళకు ఆనందం’ అనే సామెత కూడా ఉంది. అట్లనే ‘వెర్రి వెయ్యి రకాలు’ అని కూడా అంటారు. ఎవలు ఎన్ని వేషాలు వేసినా ‘ఒకనాటి బాగోతానికి మూతి మీసాలు కొరిగిచ్చుకున్నట్టు’ అయితది. ‘ఎగిరిపోయిన దూది గాలిల ఎంతసేపు ఉంటది’ అన్నట్టు ఎన్ని నటనలు చేసిన వారైనా తెల్లవారి మామూలు మనుషులు అయిపోవాల్సిందే…..
– అన్నవరం దేవేందర్‌, 9440763479