స్లాన్‌ చెస్‌ చాంప్‌ కర్తవ్య

హైదరాబాద్‌: స్లాన్‌ తొలి అంతర్జాతీయ ఓపెన్‌ ఫిడే రేటేడ్‌ చెస్‌ టోర్నీలో గుజరాత్‌కు చెందిన అనద్కట్‌ కర్తవ్య చాంపియన్‌గా నిలిచాడు. యూసుఫ్‌గూడ ఇండోర్‌ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన టోర్నీలో కర్తవ్య 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఫైనల్‌ రౌండ్‌లో కర్తవ్య..ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ కష్ణతేజను ఓడించడం ద్వారా టైటిల్‌ విజేతగా నిలిచాడు. అయితే ఎనిమిదేసి పాయింట్లతో అనూజ్‌ శ్రీవర్తి, రామనాథన్‌ బాలసుబ్రమణ్యం, మందర్‌ ప్రదీప్‌ సమంగా నిలువగా, టై బ్రేక్‌ స్కోర్లతో రెండు, మూడు, నాలుగు స్థానాలకు వీరిని విజేతలుగా ప్రకటించారు. టైటిల్‌ దక్కించుకున్న కర్తవ్యకు ట్రోఫీతో పాటు లక్ష రూపాయల ప్రైజ్‌మనీ లభించింది. టోర్నీలో మొత్తం 97 మందికి పది లక్షల నగదు ప్రోత్సాహకాలు అందించారు. టోర్నీలో ఏడు దేశాల నుంచి ఈసారి 525 మంది ప్లేయర్లు పోటీపడ్డారని నిర్వాహకుల తెలిపారు. పోటీల ముగింపు కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.