చితికిన చిన్న తరహా పరిశ్రమలు

– ఆరేండ్లుగా నిలిచిపోయిన రాయితీలు
– పెండింగ్‌లో రూ. 3,500 కోట్ల బకాయిలు
– పదివేలకు పైగా పరిశ్రమల మూసివేత
– లక్షలాది మందికి ఉపాధి దూరం
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) పరిశ్రమలు పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. గత ఆరేండ్లుగా రాయితీలు అందక ఈ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2017 నుంచి వివిధ సబ్సిడీల రూపంలో చెల్లించాల్సిన బకాయిలు రూ.3,500 కోట్లకు చేరుకున్నాయి. ఆరంభంలో అనుమతుల మంజూరు, వసతుల కల్పనలో వేగంగా స్పందించిన సర్కార్‌ అ తర్వాత పట్టించుకోక పోవడంతో గత ఐదేండ్లలో దాదాపు 10 వేలకు పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. ఫలితంగా వేలాది మంది చిన్న పరిశ్రమల యజమానులు రోడ్డున పడగా, లక్షలాదిమంది ప్రజలు ఉపాధి కోల్పోయారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ ఇండిస్టీయల్‌ ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌ (టీఎస్‌ఐపాస్‌) పేరుతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఆరంభ శూరత్వమే అనే అపవాదును మూటగట్టుకుంటోంది. పరిశ్రమ స్థాపించే క్రమంలో చొరవ చూపించి ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగంలో దాదాపు 80 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సగానికిపైగా ఉండగా, మిగిలిన సగం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రంగంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు వల్ల విరివిగా ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతుందనే భావనతో ప్రభుత్వం వీటికి అనేక రాయితీలు అందిస్తోంది. సరళతర వ్యాపార నిర్వహణ, స్థానికంగా ఏర్పాటు ప్రాతిపదికన వీటికి రాయితీలను వర్తింప జేస్తారు. కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు స్టాంప్‌డ్యూటీ రిఫండ్‌ 20 నుంచి 25 శాతం వరకు చెల్లిస్తారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధారణ రాయితీతో పాటు అదనంగా 10 శాతం ఇస్తారు. షెడ్యూల్‌ కులాలు, తెగల వారికి ప్రత్యేక రాయితీలను అందిస్తారు. దీర్ఘకాల రాయితీ అయిన విద్యుత్‌ వాడకంపై యూనిట్‌కు రూ.1 అన్ని కేటగిరీలకు వర్తింపజేస్తారు. ఇవి కాకుండా జిల్లా, మండల స్థాయిలో పరిశ్రమల వారీగా, ప్రాంతాల వారీగా కొన్ని అదనపు రాయితీలను కూడా అందిస్తారు. అయితే గత ప్రభుత్వం ఆరేండ్లుగా ఈ రంగానికి చెల్లింపులు ఆపేసింది. 2017 నుంచి ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంపిక చేసిన కొన్ని పరిశ్రమలకు మాత్రం రూ.300 కోట్ల వరకు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.3,500 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు చెల్లించాల్సిన రాయితీలు అందకపోవడంతో ఆరేండ్లలో దాదాపు 10 వేలకు పైగా మూతపడ్డాయి. ఇందులో ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 4వేలు, మిగతా జిల్లాల్లో 6 వేలు ఉన్నాయి. కొత్త పారిశ్రామిక వేత్తలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తామని చెప్పిన గత సర్కార్‌ ఆచరణలో విఫలమైంది. మార్కెటింగ్‌, నైపుణ్యలేమి, ప్రభుత్వ నిర్ణయాలు స్థిరంగా లేకపో వడం, పథకాల అమలు పరిచే అధికార యంత్రాంగం వైఫల్యం మూలంగా ఈ రంగం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకు పోయింది. ప్రభుత్వం నిర్లక్ష్యం మూల ంగా అప్పులు తెచ్చి స్వీయ ఉపాధితో పాటు నలుగురికి అండగా ఉంటామని భావించిన వేలాది మంది చిన్న, చితక పారిశ్రామిక వేత్తలు అప్పుల పాలుకాగా, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
నామ మాత్రంగా తయారైన హెల్త్‌ క్లినిక్‌
రాష్ట్రంలో మూత పడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణ హెల్త్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ కమిషనర్‌, టీఎస్‌ఐఐసీ ఎమ్‌డీలతో పాటు బ్యాంకింగ్‌ తదితర రంగాలకు చెందిన నిపుణుల సారథ్యంలో ఈ క్లినిక్‌ పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డ పరిశ్రమలకు రుణాలు, మార్కెటింగ్‌ నైపుణ్యం, ఉత్పత్తిలో ఆధునిక మెళకువలను అందిస్తుంది. సరైన ప్రచారం లేకపోవడంతో మూతపడ్డ పరిశ్రమలను తెరిచేందుకు సహాయం కావాలంటూ ఎవరూ హెల్త్‌ క్లినిక్‌ను సంప్రదించడం లేదు. 2017 నుంచి దాదాపు 10 వేలకు పైగా పరిశ్రమలు మూత పడితే ఈ సంస్థ ఎంపిక చేసిన 300 పరిశ్రమలకు మాత్రమే సహాయం అందించటం గమనార్హం.