‘స్మార్ట్‌’ బెట్టింగ్‌..!

'Smart' betting..!– నేడు ఇండో- పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై రూ.కోట్లలో లావాదేవీలు
– ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కూడా…
– స్మార్ట్‌ఫోన్లలోనే గుట్టుగా వ్యవహారం
– మాఫియా మాయలో యువత
– కోడ్‌ల ఆధారంగా నిర్వహణ
– అన్నింటికీ యాప్‌లు…
– ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వరల్డ్‌ కప్‌ క్రికెట్‌లో అత్యంత కీలకమైన ఇండో పాకిస్తాన్‌ మ్యాచ్‌ శనివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు వేదికగా భారీగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దానికి సంబంధించిన బెట్టింగ్‌లు కూడా సాగుతున్నాయి. ఆ రాష్ట్రాల వారీగా బెట్టింగ్‌ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఎన్నికల బెట్టింగ్‌ యాపుల్లోనూ భారీగా లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇటు క్రికెట్‌, అటు ఎలక్షన్‌… బెట్టింగ్‌ అంతా యాప్‌ల ఆధారంగానే నడుస్తోంది. బాల్‌ బాల్‌ బెట్టింగ్‌ మొదలు మ్యాచ్‌ ముగింపు వరకు ప్రతి మలుపుపై పందేలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఏ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తారు? తుది జట్టు ఎలా ఉంటుంది? ఏ బౌలర్‌ ఎన్ని రన్స్‌ ఇస్తారు..? ఇలా ప్రతి అంశంపైనా బెట్టింగ్‌ల నిర్వహణకు యాప్‌లు అందు బాటులోకి వచ్చాయి. మరోవైపు ఎన్నికల బెట్టింగ్‌ యాప్‌లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎన్ని సీట్లు వస్తాయి? తదితర అంశాలతో వీటిని రూపొందించారు. ఇదే అదనుగా బెట్టింగ్‌ మాఫియా పురి విప్పుతోంది. యువత స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతోంది. బెట్టింగ్‌ రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆయాచిత సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్‌ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు.
బాల్‌ బాల్‌కూ బెట్టింగ్‌..
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టాస్‌ గెలవడం నుంచి బాల్‌ బై బాల్‌, ఓవర్‌ బై ఓవర్‌ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్‌కు దిగుతున్నారు. దీనికితోడు సెల్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను వీధిన పడేయడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే దుస్థితికి చేరుకున్న ఉదంతాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. దీనిపై ఆశించిన రీతిలో పోలీసు నిఘాలు లేకపోవడం గమనార్హం.
కోడ్‌లతో లావాదేవీలు
చాలా వరకు పందేలు కోడ్‌లతోనే నిర్వహిస్తున్నారు. గెలిచే జట్టును ఫ్లయింగ్‌, ఓడిన జట్టును ఈటింగ్‌, రూ.వెయ్యిని ఫింగర్‌, రూ.10 వేలను బోన్‌, రూ.లక్షను లెగ్‌ అని పిలుస్తారు. ఫోన్‌ పే, జీ పే ద్వారా నగదు లావాదేవీలు సాగిస్తున్నారు. ఖమ్మంలోని నిజాంపేట ప్రాంత వాసులు, రాజస్థానీ వ్యాపారులు, నగర శివారు ప్రాంతాల్లో అధికంగా క్రికెట్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి సింగరేణి బెల్ట్‌లో నేటి మ్యాచ్‌పై కోట్లలో పందేల లావాదేవీలు సాగుతున్నట్టు సమాచారఇలా రాష్ట్రవ్యాప్తంగా కోట్లల్లోనే పందేలు నడుస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్‌ కార్యకలాపాలు అధికంగా సాగుతూ ఉండటంతో పోలీసులు సైతం దీన్ని ఛేదించడం పెద్ద సవాల్‌గా మారింది.
హిడెన్‌ యాప్‌లే కీలకం
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో రూ.10వేల నుంచి బెట్టింగ్‌ చేసే వెసులుబాటు ఉంది. ఇవి చాలా వరకు హిడెన్‌ మోడ్‌లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్‌లు కనిపించవు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్‌ విధానం ఉండేది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బెట్టింగులు అధికంగా సాగుతున్నట్టు సమాచారం. ఆయా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, పందెంరాయుళ్లు కొన్ని లాడ్జీల్లో రూములు, అపార్ట్‌మెంట్‌లలో ప్లాట్లు అద్దెకు తీసుకుని యథేచ్ఛగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలిసింది. హైవేల్లో దాబాల్లో సైతం పందెంరాయుళ్లు మకాం వేస్తున్నట్టు వినిపిస్తోంది. గ్రామాల్లో పొలాలు, చెరువు గట్లు, కొందరు ఇండ్లలోనే కారు రాజా కారు పందేలు నడుసున్నాయన్న ప్రచారం నడుస్తోంది.
పొలిటికల్‌ బెట్టింగ్‌ యాప్‌లు..
ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్‌ బెట్టింగ్‌ యాప్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ప్రధానంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎన్ని సీట్లు సాధిస్తుంది? కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయి? బీఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాలు దక్కిం చుకుంటుంది. ప్రధాన పార్టీల బలాబలాల పైన బెట్టింగులు సాగుతున్నాయి. ఇవి కాక ముఖ్యమైన నియోజక వర్గాలు.. వాటిలో అభ్యర్థులు గెలుపొందేవారు.. ఓడేవారు.. మెజారిటీలు.. ఇలా డిఫరెంట్‌.. డిఫరెంట్‌ బెట్టింగ్‌ లోకల్‌గా సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనే అంశం పైనా భారీగా బెట్టింగులు సాగుతుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు సైతం ఉమ్మడి జిల్లా ఎన్ని కలు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై బెట్టింగులు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది.