
నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా రాష్ట్రానికి అదనపు నిధులు దక్కుతాయని, తగిన తోడ్పాటు లభిస్తుందని తెలంగాణ ప్రాంత ప్రజలు ఆశించారని కానీ వారికి నిరాశే మిగిలిందని నార్త్ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఫౌండర్ & చైర్మన్ డాక్టర్ బి కేశవులు అన్నారు. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందిస్తూ ..జాతీయ స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉందని, కానీ తాజా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని, గిరిజన యూనివర్సిటీకి నిధులు సహా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తీగా విఫలమైందని డాక్టర్ బి కేశవులు అన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు మరీ అన్యాయం జరిగిందని, నిజామాబాద్ లేదా అదిలాబాద్ కు కనీసం స్మార్ట్ సిటీ నైనా కేటాయించలేదని, ముగ్గురు ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించినప్పటికీ ఉత్తర తెలంగాణపై కేంద్రం ఏమాత్రం ఔధర్యము చూపించలేదని డాక్టర్ కేశవులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, తెలంగాణ ఎంపీలు పదే పదే ఢిల్లీ పర్యటనలు చేసినా ఫలితం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తాజా బడ్జెట్ లో తెలంగాణకు హక్కుగా వచ్చే వాటాలే తప్ప ప్రత్యేక మైనా కేటాయింపులు ఏమీ లేవని. కొత్త బడ్జెట్ ప్రకారం పన్నుల్లో వాటా, కేంద్ర పథకాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26 లో రూ.45 వేల కోట్లు అందనున్నాయని. సెంట్రల్ జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రానికీ నిర్ణీత వాటా ప్రకారం 2.102 శాతం నిధులు అంటే రూ.29,890 కోట్లు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయని డాక్టర్ కేశవులు తెలిపారు.