‘సిరిమల్లె పూవల్లె నవ్వు… చిన్నారి పాపల్లె నవ్వు…’, నవ్వాలమ్మా.. నవ్వాలి.. పువ్వువోలే నవ్వాలి.. ‘ అంటూ నవ్వుపై సినిమా పాటల్లో కవులు అల్లిన పదాలివి. కానీ.. ఇప్పుడున్న యాంత్రిక జీవనవిధానంలో ఎవరు మాత్రం నవ్వుతున్నారు..? హాయిగా జీవిస్తున్నారు..? ఎంతసేపు బిజీ పనులు, గజిబిజి జీవితం. వీటికి తోడు అదనపు బాధ్యతలు. ఇవన్నీ కలగలసి హాయిగా ఓ ఐదు నిమిషాలు కూడా నవ్వలేకపోతున్నారు జనం. కానీ.. ఇది మన భవిష్యత్‌పైనే తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.
ఓ నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నవ్వుకుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ! మరి ఆచరణలో పెడితే ఇంకెంత బాగుంటుందో! ఆ నవ్వు ప్రభావంతో మనలోని ఒత్తిడి పారిపోతుంది. రక్త సరఫరా సరిగ్గా ఉంటుంది. హృదయం చక్కగా పనిచేస్తుంది. గుండె సమస్యలు వేధించవు. ఎలాంటి అనారోగ్యసమస్యలు దరిచేరవు. కానీ.. ఉదయం లేచింది మొదలు ఆఫీస్‌లో పనిఒత్తిడి కారణంగా నవ్వడమనేదే గగనమైపోయింది ఈ యాంత్రిక జీవన విధానంలో. ఈ కారణాల చేత ఎన్నో జబ్బులు మనపై దాడి చేస్తున్నాయి.
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్న మాటలు అక్షరసత్యాలు. వీటిని మన జీవితంలో అన్వయించుకుంటే ఎంతటి సమస్యలైనా సరే.. మనపై ప్రభావం చూపలేవు. అందుకే మీకు మీరుగా ఓ ప్రశ్న వేసుకోండి.. మీరు మనసారా నవ్వి ఎన్నిరోజులైంది? కడుపుబ్బా నవ్వి కళ్లలో నీరు కనిపించి ఎన్నాళ్లయిందో కదూ. నిజం చెప్పండి. మనస్ఫూర్తిగా, హాయిగా నవ్వుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు కదూ..! నవ్వు.. మనకు ప్రశాంతతను కల్పిస్తుంది. మన ఆరోగ్యం విషయంలో ఓ దివ్యౌషధంలా పనిచేస్తుంది.
నవ్వు అనేక వ్యాధులను దూరం చేసే మంచి టానిక్ లాంటిది. దీనిని మించిన వ్యాయామం మరోటి లేదనే చెప్పాలి. నవ్వుతూ ఉండటం వల్ల దినమంతా మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపొచ్చు. మన రోజు వారి పనుల్లో మరింత ఉత్పాదకత చూపించొచ్చు. నవ్వడం వల్ల మనకు ఇలాంటి ఎన్నో లాభాలు ఉన్నాయి. నవ్వు మనకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా మన మానసిక ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, రక్తనాళాల పనితీరును కూడా మెరుగుపరుస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. నవ్వు ఒత్తిడికి సంబంధించిన అనేక ప్రతికూల లక్షణాలను తగ్గిస్తుంది.
నవ్వినప్పుడు మన శరీరం ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్. ఈ హార్మోన్లు ఉత్పత్తి కావడం వల్ల మనలో ప్రతికూల భావోద్వేగాలు దూరం అవుతాయి. నవ్వు మన గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడానికి నవ్వు ఒక సులభమైన మార్గమని వైద్యులు కూడా చెబుతున్నారు. నవ్వాలంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఆనందపు కాంతులను వెదజల్లడానికి ప్రేరేపిస్తుందని చెప్పడంలో ఎలాంటి ఔచిత్యం లేదు.
ఒకప్పుడు నలుగురు ఒక చోట చేరితే.. ఎన్నో విషయాలను చర్చించుకుంటూ హాయిగా నవ్వుకునే వారు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అందుకే కొన్ని స్వచ్చంధ సంస్థలు నవ్వుకు ప్రాధాన్యమిస్తూ లాఫింగ్ క్లబ్స్ అంటూ కొత్త మార్గాలను ప్రవేశపెట్టాయి. దీంతో కాస్తైనా నవ్వుకోవచ్చని. ఇప్పటికైనా అన్నింటిని మరిచి హాయిగా నవ్వండి. మీ చుట్టూ ఉన్నవారిని నవ్వించండి. హాయిగా జీవించండి.