నవ్వు.. చిరునవ్వు

సంతోషం అంటే మనం క్షేమంగా ఉన్నామనే ఒక స్థితి. అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపట్లో పోయేది కాదు. జీవితంలో కొద్దిపాటి సంతృప్తి కలిగినప్పుడు లేదా ఎంతో లోతైన ఆనందం కలిగినప్పుడు వచ్చే భావాలన్నీ సంతోషంలో భాగమే. కానీ ఈ భావాలు అలా ఉండిపోతేనే అది నిజమైన సంతోషం. కాబట్టి సంతోషాన్ని ఒక గమ్యంగా లేదా లక్ష్యంగా వర్ణించలేము. అది ఒక నిత్య ప్రయాణం. ”ఇలా జరిగితే నేను సంతోషంగా ఉంటాను” అని అంటున్నామంటే మనం సంతోషాన్ని వాయిదా వేసుకుంటున్నామని అర్థం.
చిరునవ్వులు చిందించే మోము కనబడితే మన మనసు కూడా చిందులు వేస్తుంది. కల్మషమెరుగని చిరునవ్వు మనలోని ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే తరిమేస్తుంది. అందుకే ‘నవ్వు నాలుగు విధాలు చేటు’ అనే పాత సామెత స్థానంలో ‘నవ్వు నలభై విధాల గ్రేటు’ అనే కొత్త సామెత వచ్చింది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వారి చుట్టూనే జనం చేరతారు. చిర్రుబుర్రులాడుతూ మొహం చిట్లించే వారి వద్దకు వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు.
మనం ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకుంటుంటారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే సంతోషం చాలా ముఖ్యం. నవ్వు మనకు ఓ మాననసిక శక్తిని అందిస్తుంది. అందుకే చూడండి బాధలో తీసుకునే నిర్ణయాలకన్నా ప్రశాంతంగా ఉన్నపుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే బాధలో మనం సరిగ్గా ఆలోచించలేము. మనసు ప్రశాంతంగా ఉంటే సంతోషం మన వెంట ఉన్నట్టే. అటువంటి సమయంలో చక్కటి నిర్ణయాలు తీసుకోగలం. అయితే మనం సంతోషంగా ఉండానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మన కుటుంబం, చేసే పని, స్నేహితులు ఇలా ఎన్నో విషయాలు మన ఆనందానికి కారణంగా ఉండవచ్చు.
సంతోషానికి కలిగించే సంఘటన కోసం మనిషి ఎదురు చూడడం సహజం. చదువు ముగించుకొని మంచి ఉద్యోగం దొరికితే కొందరికి ఆనందం. కొత్త వస్తువేదైనా కొనుక్కుంటే మరికొందరికి ఆనందం. చాలామంది అనుకున్న లక్ష్యాన్ని సాధించినా, కోరుకున్న వస్తువును పొందినా కొంత సంతోషాన్ని పొందవచ్చు. అయితే అలాంటి ఆనందం సముద్రంలో వచ్చే అల లాంటిది. అలల మాదిరిగానే ఆ సంతోషం కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనిషి కోరికలు అనంతం. ఒక లక్ష్యం చేరుకుంటే మరో లక్ష్యం మన కోసం సిద్ధంగా ఉంటుంది.
అయితే సంతోషం అంటే మనం క్షేమంగా ఉన్నామనే ఒక స్థితి. అది కొద్దిసేపు ఉండి కొద్దిసేపట్లో పోయేది కాదు. జీవితంలో కొద్దిపాటి సంతృప్తి కలిగినప్పుడు లేదా ఎంతో లోతైన ఆనందం కలిగినప్పుడు వచ్చే భావాలన్నీ సంతోషంలో భాగమే. కానీ ఈ భావాలు అలా ఉండిపోతేనే అది నిజమైన సంతోషం. కాబట్టి సంతోషాన్ని ఒక గమ్యంగా లేదా లక్ష్యంగా వర్ణించలేము. అది ఒక నిత్య ప్రయాణం. ”ఇలా జరిగితే నేను సంతోషంగా ఉంటాను” అని అంటున్నామంటే మనం సంతోషాన్ని వాయిదా వేసుకుంటున్నామని అర్థం.
మనం మంచి దారిలో నడిచినప్పుడు, మంచి నియమాలకు అనుగుణంగా జీవించినప్పుడు వచ్చే ఫలితమే సంతోషం. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసి తృప్తిపడే వారు మన చుట్టూ ఎందరో ఉంటారు. నలుగురికి సాయం చేసినప్పుడు వచ్చే ఆనందం, తృప్తి మాటల్లో చెప్పలేనిది. అది సాయం చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొందరు వారు చేసే త్యాగంలోనే ఆనందాన్ని వెదుక్కుంటారు. ప్రేమించిన వ్యక్తి మనకు దక్కకపోయినా తాను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని భావించే వారు నిజమైన ప్రేమికులు. ఇలాంటి వారి త్యాగం మరొకరికి జీవితాన్ని ఇస్తుంది. అలాగే భగత్‌సింగ్‌ తన 23 ఏండ్ల వయసులో దేశం కోసం చిరునవ్వులు చిందిస్తూ ప్రాణత్యాగం చేశాడు. అతని చిరునవ్వు వేల మందిలో స్ఫూర్తిని రగిలించింది. దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేసింది. ఇలాంటి ఆనందాలు, చిరునవ్వులు, ఓ చరిత్రనే సృష్టిస్తాయి. ఎన్నో అద్భుతాలు చేస్తాయి. మరెన్నో విజయాలను తెచ్చిపెడతాయి.