నవ్వుల్‌ పువ్వుల్‌

జన్మస్థలం
టికెట్‌ కలెక్టర్‌ : టికెట్‌ ప్లీజ్‌…
నన్నాసి : లేదు.
టికెట్‌ కలెక్టర్‌ : ఎక్కడికి వెళ్తున్నావు?
నన్నాసి : రాముడు పుట్టిన ప్రదేశం… అయోధ్యకి.
టికెట్‌ కలెక్టర్‌ : అయితే పద…
నన్నాసి : ఎక్కడికి?
టికెట్‌ కలెక్టర్‌ : కృష్ణుడు పుట్టిన స్థలం.. జైలుకి.
ఎంకరేజ్‌ చెయ్యాలి
లాయర్‌ : నువ్వెంత చాకచక్యంగా నగలు దొంగిలించావో సిసి కెమెరాలో రికార్డయింది. సాక్ష్యం కూడా ఉంది. ఇప్పుడు కూడా దొంగతనం చేయలేదంటావా?
దొంగ : అలా ఎందుకంటానండీ… నా ఫెర్ఫార్మెన్సు కనక మీకు నచ్చినట్టయితే కె.డి.1 అని టైప్‌ చేసి స్పేసిచ్చి 420కి ఎస్సెమ్మెస్‌ పంపి, నన్ను ఎంకరేజ్‌ చెయ్యమని జడ్జి గారికి మనవి చేసుకుంటా.
మంచి సంపాదన
గుర్నాథం : సదానందం! అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావంట. ఏదన్నా సంబంధం కుదిరిందా?
సదానందం : ఆ.. మంచి సంబంధమే కుదిరింది. అబ్బాయికి ఆరు ఫేస్‌బుక్‌ అకౌంట్లు, పన్నెండు వాట్సప్‌ గ్రూపులు, పదిహేను గూగూల్‌ ఐడీలు, యాభైవేల మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఎంత లేదన్నా నెలకు లక్ష పైనే సంపాదన.
నాక్కూడా ఇస్తావా నాన్నా
కూతురు : నాన్నా… మిమ్మల్ని ఒకటి అడుగుతాను. చేస్తారా?
తండ్రి : తప్పకుండా చేస్తాన్రా. ఏం కావాలో చెప్పు.
కూతురు : నేను పెద్దయి, నా పెళ్ళయ్యాక మా ఆయన అడిగినవన్నీ కొనిస్తావా? ఎలాగంటే నువ్వు తాతయ్యని అడిగి అన్ని వస్తువులు తెప్పించుకుంటున్నట్టు.
ఓవర్‌టైమ్‌
పోలీస్‌ : ఇలా పగటి పూట కూడా కన్నాలేసి దొరికిపోయేవాడిని నిన్నే చూస్తున్నా.
దొంగ : మరేం చెయ్యమంటారు సార్‌… రాత్రి పూట దొంగతనం చేస్తే వచ్చిన డబ్బు సరిపోవట్లేదు. అందుకే ఓవర్‌టైమ్‌ చేస్తున్నా.