అరంగేట్రం టెస్ట్‌లోనే స్మిత్‌ సెంచరీ

అరంగేట్రం టెస్ట్‌లోనే స్మిత్‌ సెంచరీ– రసపట్టులో ఇంగ్లండ్‌-శ్రీలంక టెస్ట్‌
మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలిటెస్ట్‌ రసపట్టుగా నడుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 358పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 95 పరుగుల్లోపే నాలుగు వికెట్ల పడకొట్టి పట్టు బిగిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 6వికెట్ల నష్టానికి 259పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ జట్టు 358పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం టెస్ట్‌లోనే జెమీ స్మిత్‌(111) సెంచరీతో కదం తొక్కాడు. వోక్స్‌(25), అట్కిన్సన్‌(20), వుడ్‌(22) కూడా బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఇంగ్లండ్‌కు 122పరుగుల ఆధిక్యత లభించింది. శ్రీలంక బౌలర్లు అసితా ఫెర్నాండోకు నాలుగు, ప్రభాత్‌ జయసూరియకు మూడు, విశ్వ ఫెర్నాండోకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక జట్టు 98పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయానికి శ్రీలంక జట్టు ఇంకా 24పరుగులు వెనుకబడి ఉంది. క్రీజ్‌లో మాథ్యూస్‌(43), కమిందు(2) ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లు వోక్స్‌, అట్కిన్సన్‌, వుడ్‌, పాట్స్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.