లోపల పెచ్చులు.. బయట పాములు

లోపల పెచ్చులు.. బయట పాములు– ఓయూలో భయబ్రాంతులతో ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌ విద్యార్థులు
–  బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న వైనం
–  ఓ విద్యార్థికి తప్పిన ప్రాణగండం
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం 105 ఏండ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీ. దీనిలో ముఖ్యంగా న్యూ రీసెర్చ్‌ స్కాలర్‌ హాస్టల్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌హెచ్‌) అంటే తెలంగాణ ఉద్యమ వ్యూహాలకు, సామాజిక న్యాయానికి, పరిశోధనలకు పెట్టింది పేరు. కానీ దాని నిర్వహణ, బాగోగులను గాలికి వదిలేశారు ఓయూ అధికారులు. విద్యార్థుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట అన్న మాటలు తప్ప అమల్లో ఎక్కడా చిత్తశుద్ధి లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పీహెచ్‌డీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వసతిగృహాల్లోని గదులు, బాత్‌ రూమ్‌లలో అనేకసార్లు శ్లాబ్‌ పెచ్చులు ఊడిపడ్డాయి. విద్యార్థులు వాటి నుంచి బయటపడ్డారు. ఇప్పటికీ కొన్ని రూమ్స్‌, వరండాల్లో శ్లాబ్‌ పెచ్చులు ఎప్పుడు ఊడిపడతాయో అనే పరిస్థితి ఉంది. విద్యుత్‌ సరఫరా కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల రెండుసార్లు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
పాములు, విష పురుగులకు నిలయంగా..
మునుపెన్నడూ లేనంతగా హాస్టల్‌ పరిసరాల్లో వివిధ రకాల ప్రమాదకరమైన పాములు, విషపురుగుల సంచారం పెరిగింది. ఇటీవల పీహెచ్‌డీ విద్యార్థి విష్ణును విషపురుగు కాటేసింది. ఇతర విద్యార్థులు ఆ పామును చంపేశారు. బాధిత విద్యార్థిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటి వరకు అనేక విషపురుగులు, పాములు కనిపించడంతో విద్యార్థుల విన్నపం మేరకు అధికారులు ఇటీవల ఆరుబయట వీధి దీపాలు ఏర్పాటు చేశారు. పాములు, విషపురుగులు వసతిగృహంలోకి రాకుండా శాశ్వత పరిష్కారమార్గాలు చూడటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంటినరీ పైలాన్‌ను కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసే బదులు తగిన సంఖ్యలో వసతిగృహాల నిర్మాణాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల వసతిగృహాల నిర్మాణాలకు ఎస్టిమేషన్‌, టెండర్లు అంటూ కాలం వెళ్లదీస్తున్న అధికారులు వీసీ అధికారిక నివాసం, వీసీ కార్యాలయాలకు రోజుల వ్యవధిలోనే పనులు ఎలా పూర్తి అవుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
మరుగుదొడ్ల నిర్మాణం
మరుగుదొడ్లు పనిచేయక వసతి గృహాల పరిసరాల్లో మురుగునీరు, తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే అధికారులు కొత్తగా మరుగుదొడ్లు నిర్మాణం చేయించారు. ఇది ఒక్కటి తప్ప మరే సౌకర్యాలూ మెరుగుపర్చలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.