– రైతుల నిరసన.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-గణపురం
అంకుర్ సీడ్స్ వాడితే మంచి దిగుబడి వస్తుందని రైతులకు ఆశ చూపి మాయమాటలు చెప్పి.. దిగుబడి వచ్చాక ఆ సీడ్స్‌ను తామే కొనుగోలు చేస్తామని నమ్మించి నిండా ముంచిన సంఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో చోటుచేసుకుంది. బాధిత రైతులు చేసేదేమీ లేక సోమవారం అంకుర్ సీడ్స్ వరితో రోడెక్కి ధర్నా చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండల కేంద్రానికి చెందిన 23మంది రైతులకు అంకుర్ సీడ్స్ వాడితే బాగా దిగుబడి వస్తుందంటూ 86 ఎకరాలకు సరిపోను ధాన్యాన్ని అంకుర్ సీడ్స్ ప్రతినిధులు ఇచ్చారు. దాంతో రైతులు దండు రాములు, దయ్యాల భద్రయ్య, మల్లయ్య, వడ్లకొండ దుర్వాసులు, వడ్లకొండ తిరుపతి, మామిండ్ల సారంగపాణి, పొట్లూరి సురేష్, రవి, కుమార్, తదితర రైతులు అంకుర్ సీడ్స్ వరి సాగు చేస్తున్నారు. 130 రోజులకు పంట దిగుబడి వస్తుంది. 60 రోజులకు పొట్టకు రావాల్సి ఉండగా 35 రోజులకే వచ్చింది. దాంతో ఆందోళన చెందిన రైతులు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి కంపెనీ ప్రతినిధులు రైతుల ఫోన్లు ఎత్తకుండా నిర్లక్ష్యం వహించారు.
దాంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వేసిన పంట కూడా ఎకరాకు ఐదు బస్తాలు కూడా రాని పరిస్థితి. మొత్తం ధాన్యం తాలుగా ఉంది. దాంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సాంబమూర్తి.. సీడ్స్ ప్రతినిధులతో మాట్లాడి రెండు రోజుల్లో రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు.