”పుట్టినరోజు పండుగే అందరికీ.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే” అంటారు సినారే. ఆ కొందరిలో డా.కందాళ శోభారాణి కూడా ఒకరు. ఆమె జీవితం వడ్డించిన విస్తరి కాదు. ముళ్లు, రాళ్లు ఎన్నున్నా రాజీలేని పోరాటం చేసి నిటారుగా నిజాయితీగా నిలబడిన వ్యక్తిత్వం. తన కలాన్ని గళాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ రాటుదేలిన సామాజిక ఉద్యమ కర్తగా ఎదిగిన రచయిత. ఫిబ్రవరి 8న జరగబోయే ఆమె మొదటి యాది సభ సందర్భంగా…
డా.కందాళ శోభారాణి 1973 ఏప్రిల్ 29న వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో సాంప్రదాయ వడ్రంగి వృత్తిలో జీవనం గడుపుతున్న శ్రామిక కుటుంబానికి చెందిన కందాల అనసూర్య-రామచంద్రయ్య దంపతులకు జన్మించారు. మధ్యతరగతి శ్రామిక వర్గం కావడం మూలంగా పసితనం నుండే కష్టాల కొలిమిలో కాలుతూ సామాజిక ఉద్యమకారిణిగా ఎదిగారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు శోభారాణి అయినా చిన్న పెద్ద తేడా లేకుండా ఆమెకు సమాజం పెట్టుకున్న పేరు శోభక్క.
నిలబడి కలబడ్డారు
చదువు-సమీకరించు-పోరాడు అన్న అంబేద్కర్ సూక్తిని ఆచరణలో పెట్టడం కోసం తన వైయుక్తిక ఎదుగుదలను,జీవనాన్ని పక్కనపెట్టి నికార్సుగా తన ఆశయ ప్రయాణాన్ని కొనసాగించారు. వరంగల్ జిల్లా ఒకప్పటి విద్యార్థి సంఘ నాయకుడైన తాటిపాముల రమేష్ తన జీవిత సహచరుడు కావడం, తన ఆశయ సాధనకు మరింత పటుత్వం ఏర్పడింది. బతకనేర్చిన వాళ్ళు సమాజంతో రాజీపడి వైయుక్తికమైన తమ ఆశయాలను లక్ష్యాలను సాధిస్తారు. బతుకు నిచ్చే వాళ్లు సమాజంతో అనునిత్యం సంఘర్షిస్తూ కడ ఊపిరి దాకా తమ జీవితాన్ని కొవ్వొత్తిగా మార్చుకుంటారు. ఆ క్రమంలో శోభారాణి పౌరహక్కుల, మహిళా, కార్మిక-కర్షక, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కుళ్ళు రాజకీయాలకతీతంగా నిలబడి కలబడ్డారు.
సాహిత్య జీవితం
ఉద్యమాల్లో పాల్గొంటూనే విద్య పట్ల కూడా సమదృష్టిని పెట్టి కాకతీయ విశ్వవిద్యాలయంలో యం.ఏ తెలుగు చేశారు. వివిధ పత్రికల్లో, సాహిత్య సంకలనాల్లో వ్యాసాలు, కవితలు, కథలు రాసి రచయిత్రిగా ఎదిగారు. ‘తెలుగు సాహిత్య విమర్శ- స్త్రీల కృషి’ అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి డాక్టర్ పట్టా పొందారు. ఈ పరిశోధనా సమాచార సేకరణ కోసం తెలుగు నాట ప్రసిద్ధ పొందిన వేటపాలెం గ్రంథాలయానికి వెళ్లి అక్కడ మూల మూలన దాగిన గ్రంథాల బూజు దులిపి సమాచారాన్ని సేకరించారు. వివిధ పత్రికలకు, సంకలనాలకు రాసిన వ్యాసాలను, జాతీయ ప్రాంతీయ సదస్సులో సమర్పించిన వ్యాసాలను క్రోడీకరించి వ్యాస శోభిత, తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు, సాహిత్యావలోకనం వంటి వ్యాస సంపుటాలు ప్రచురించారు. రుద్రమ, బందగీ ప్రచురణల్లో భాగస్వామిగా చేరి రచనలు చేశారు.
అధ్యాపకురాలిగా పనిచేస్తూ…
ఇక తన చదువుకు తగిన గుర్తింపు సార్థక్యం కోసం అధ్యాపక వృత్తిని చేపట్టి సావిత్రిబాయి పూలే బాటలో నడిచారు. రంగసాయి పేట జూనియర్ కాలేజీలో, ఎల్బీ కాలేజీలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తూ అనేక వివక్షలను ఎదుర్కొన్నారు. తన ప్రతిభే తన శత్రువు కావడంతో విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు కావడానికి ఎన్నో ఆటంకాలను, అసంతృప్తులను, కుట్రలను చవిచూశారు. చివరకు విశ్వవిద్యాలయ మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా స్థిరపడి, ప్రస్తుత విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ ప్రోత్సాహంతో సావిత్రిబాయి పూలే సంస్థకు డైరెక్టర్ కాగలిగారు. కానీ తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలోనే ఆమెను 2023 ఫిబ్రవరి 8న అకాల మృత్యువు కబళించుకుపోయింది.
– హాథిరామ్ సభావట్, 6309862071