మండలంలోని నాగపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో జరిగిన వివిధ పనులపై సామాజిక తనిఖీ గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో డిఆర్పీ నవీన్ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల వివరాలను చదివి వినిపించారు. సామాజిక తనిఖీ బృందం సభ్యులు తమ పరిశీలనలో గుర్తించిన అంశాలను సభలో వివరించారు.అనంతరం ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అన్ని పనులపై గ్రామ సభలో చర్చించారు.కూలీలు చేసిన పనుల్లో పలుచోట్ల కొలతలు తేడా ఉన్నట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు గుర్తించారు. కొలతల్లో తేడా ఉన్న పనులను మళ్లీ చేయించాలని ఉపాధి సిబ్బందికి అధికారులు సూచించారు. ఉపాధి హామీ పనులకు కూలీలు హాజరైన సంతకాలు తీసుకోకపోవడం పట్ల సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ గ్రామ సభలో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు, వీఆర్పీలు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.