సామాజిక అంశాలే నా క‌వితా వ‌స్తు‌వులు

Social issues are the subjects of my poetryడా.నీలం స్వాతి… వృత్తి రీత్యా వైద్యురాలు. డాక్టర్‌గా మనిషి శరీరానికే కాదు సమాజానికి కూడా వైద్యం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే సాహిత్యాన్ని తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. విద్యార్థి దశ నుండే తన మనసులోని భావాలను అక్షరాలుగా మలచడం మొదలుపెట్టారు. సమాజంలో మంచి మార్పులో భాగం కావాలనుకున్నారు. తన ప్రతి అక్షరాన్ని సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఎక్కుపెడుతున్న ఆ యువ డాక్టర్‌ పరిచయం నేటి మానవిలో…
మా సొంతూరు నెల్లూరు జిల్లాలోని చిన్న చెరుకూరు. అమ్మ కృష్ణవేణి, గృహిణి. నాన్న శ్రీ నరసయ్య, రైతు. ఇద్దరూ పదో తరగతి వరకు చదువుకున్నారు. మా చదువులకోసం నెల్లూరు టౌన్‌లో వుంటున్నాం. నా చదువంతా నెల్లూరులోనే సాగింది. నాకు తమ్ముడు ఉన్నాడు, ప్రస్తుతం సీఎంఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. నేను ఫార్మా-డి (డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ) చదివి డాక్టరేట్‌ పట్టా అందుకున్నాను. అంతేకాక 88% ఉత్తీర్ణతను సాధించి కాలేజీలో టాపర్‌గా నిలిచాను. ప్రస్తుతం నెల్లూరులోని అపోలో హాస్పిటల్‌లో క్లినికల్‌ ఫార్మసిస్ట్‌గా రెండున్నరేండ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. నా వృత్తి, ప్రవృత్తి కాస్తంత భిన్నమే అయినా చదువు విషయంలో మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
అభిరుచి ఇలా మొదలయింది…
10వ తరగతిలో ఉన్నప్పటి నుండో నా మనసులోని భావాలను కాగితంపై పెట్టడం మొదలు పెట్టాను. మొదటి నుండి నాకు సామాజిక అంశాలపై కవితలు రాయటం అలవాటుగా మారింది. నా తొలి కవిత ‘మిత్రమా మరవకు’ కాలేజీ కల్చరల్‌ ప్రోగ్రామ్‌లో చదివిన ఈ కవితకు మంచి ప్రశంసలు వచ్చాయి. దాంతో మరింత గొప్ప సాహిత్యాన్ని రాయాలన్న ఉత్సాహం నాలో కలిగింది. నెల్లూరు టౌన్‌ హాల్లో జరిగిన కవితాగోష్ఠిలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఆనంద్‌ గారి చేతుల మీదగా తొలి సత్కారాన్ని అందుకున్నాను. ప్రస్తుతం ఇంగ్లీషు, హిందీలో కూడా రాస్తూ త్రిభాషా కవయిత్రిగా అందరి ప్రశంసలను అందుకుంటున్నాను. తెలుగులో ఇప్పటి వరకు సుమారు 500కు పైగా కవితలు రాశాను.
మూడు పుస్తకాలు
నా మొదటి కవితా సంపుటి ‘నా కలం కల్పన’. దీని తర్వాత ‘నా కలం స్పందన’. ప్రస్తుతం ‘నా కలం సృజన’ అనే మూడో పుస్తకాన్ని ముద్రించే ప్రయత్నంలో ఉన్నాను. అనేక మంది సాహితీ ప్రియుల అభినందనలతో పాటు, అనేక ప్రశంసా పత్రాలను కూడా అందుకున్నాను. అనేక కవితా పోటీల్లో పాల్గొని పారితోషికాలు కూడా అందుకున్నాను. నా కవితలు వివిధ పత్రికల్లో కూడా ప్రచురించబడ్డాయి. మదర్స్‌ డే సందర్భంగా గర్భగుడి అనే కవితకు మంచి ప్రశంసలు అందుకున్నాను. అలాగే జమీన్‌ రైతు అనే పత్రికలో ఓ సాహితీ వ్యాసాన్ని కూడా ప్రచురించారు. అలాగే అనేక సంకలనాల్లో నా కవితలకు అవకాశం దక్కింది. పున్నమి తెలుగు అనే దిన పత్రికలో నా కవితలతో పాటు ఛాయా చిత్రాలను కూడా ప్రచురించారు. గత ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా అప్పటి రాష్ట్ర గవర్నర్‌ తమిళసై, కల్వకుంట్ల కవిత చేతుల మీదగా ఆవిష్కరించ బడిన బంగారు బతుకమ్మ అనే సంకల నంలో నా కవిత చోటు సంపాదించు కుంది. అలాగే కరోనా కవితా సంకలనం, దాశరథి కవితా సంకలనం ఇలా అనేక సంకలనాలలో నా కవితలు ముద్రించబడ్డాయి.
ఆత్మీయ సత్కారాలు
నా సాహితీ సేవలను గుర్తించి ఎందరో నన్ను ప్రోత్సహించారు. అనేక అవార్డులు, రివార్డులు, పురస్కారాలు అందించారు. వెంకటాచలం ప్రాచీన తెలుగు భాషా విశిష్ట అధ్యయన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ గోవర్ధన్‌ రెడ్డి చేతుల మీదగా సత్కారాన్ని అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా వ్యవహరించిన వాడ్రేవు చినవీరభద్రుడు గారిచే చిరు సత్కారాన్ని అందుకున్నాను. సినీ గీత రచయిత వెన్నెలకంటి చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నాను. నెల్లూరు జిల్లా జకలెక్టర్‌ చక్రధర్‌ చేతుల మీదగా ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నాను. ఇవన్నీ నా సాహితీ బాధ్యతను మరింత పెంచాయని నేను భావిస్తున్నాను. గుర్రం జాషువా జయంతి ఉత్సవాల సందర్భంగా సాహితీ సప్తాహంలో నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతిని అందుకున్నాను. తెలుగు సాహితీ వేదిక వారు నిర్వహించిన పోటీలలో ద్వితీయ బహుమతిని, తెలుగు రాష్ట్ర స్థాయి ప్రకృతి వ్యవసాయం పాటల పోటీలో విజేతగా నిలిచి పారితోషకాన్ని కూడా అందుకున్నారు. 54వ గ్రంథాలయ వారోత్సవాలలో ప్రముఖ కవి శ్రీ చిన్ని నారాయణచే చిరు సత్కారం అందుకున్నారు.
అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి
సాహిత్యం సమాజ మార్పుకు దోహదం చేయాలి. అప్పుడు నేను రాసే అక్షరాలు ఓ అర్థం. దాన్ని దృష్టిలో పెట్టుకొనే సాధ్యమైనంత వరకు సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్నే రచిస్తున్నాను. బాగా రాయాలి అంటే బాగా చదవడం కూడా అవసరం. అందుకే నాకు కాస్త సమయం దొరికినా ప్రముఖ రచయితల పుస్తకాలు చదువుతూ ఉంటాను. యువత సాహిత్యరంగంలోకి రావాలి. అప్పుడే సమాజానికి మరింత మంచి జరుగు తుంది. కానీ నేటి యువత చాలా వరకు టెక్నాలజీకి బానిసలుగా మారిపోతున్నారు. అలా కాకుండా దాన్ని ఉపయోగించుకునే రీతిలో ఉపయో గించుకుంటే చాలా మేలు జరుగు తుంది. అధ్యయనానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజం కూడా మంచి మార్గంలో నడుస్తుంది. దీనికి సాహిత్యం కూడా దోహద పడుతుంది.

– అచ్యుతుని రాజ్యశ్రీ