సామాజిక న్యాయానికి తొలి ప్రాధాన్యత

– కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత ఇస్తూ, సమన్యాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. సోమవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం, స్వయం సమృద్ధి, ఆర్థికాభివృద్ధితో పాటు పలు విద్యా పథకాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయూత అందించే పథకాలను తమ శాఖ అమలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఈ పథకాల అమలు మరింత వేగవంతం కావాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. దానికోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. వెనుకబడిన తరగతులు, జాతుల స్వయం సమృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ అన్ని రకాలుగా రాష్ట్రాలకు చేయూత అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు స్కీంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేశారు.