– మాజీ రాయబారి వినోద్ కుమార్
– దళిత స్త్రీ శక్తి సంస్థ ఆధ్వర్యంలో.. ‘దళిత ఆదివాసీ స్త్రీలు- సామాజిక న్యాయం’ సదస్సు
నవతెలంగాణ-మెహదీపట్నం
సామాజిక న్యాయం స్త్రీ శక్తి ద్వారానే సాధ్యమని భారత మాజీ రాయబారి వినోద్ కుమార్ అన్నారు. దళిత స్త్రీ శక్తి సంస్థ ఏర్పడి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లక్డీకపూల్‌లోని అంబేద్కర్ రిసోర్స్ సెంటర్‌లో ‘దళిత ఆదివాసీ స్త్రీలు- సామాజిక న్యాయం’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను వివిధ దేశాల్లో భారత రాయబారిగా ఉంటూ భారతదేశం గురించి గొప్పగా చెప్పేవాడినన్నారు. కానీ ఇక్కడ కులం మతం పేరుతో మనువాదం రాజ్యమేలుతోందని వాపోయారు. స్త్రీలు అత్యంత శక్తివంతులని, వారు వారి శక్తిని తెలుసుకొని ఆచరణలో పెడితే సామాజిక న్యాయం సులభంగా సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ మాట్లాడుతూ.. దళిత స్త్రీ శక్తి సంస్థ ఏర్పడిన 18 ఏండ్లలో ఆదివాసీ, దళిత స్త్రీలను ఏకం చేసి సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. దళిత, ఆదివాసీ స్త్రీలలో స్త్రీ పురుష సమానత్వం పట్ల చైతన్యం కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. అనంతరం దళిత స్త్రీ శక్తి 18వ వార్షిక నివేదికను వినోద్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. దళిత చట్టం, కుటుంబ హింస, మహిళల రక్షణ చట్టం గురించి వివరిస్తూ రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ గోపీనాథ్, డాక్టర్ పద్మాకర్, డైరెక్టర్ సుధారాణి, చల్ల రామకృష్ణ, సైంటిస్ట్ చారులత, బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ రామకృష్ణ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.