– నిబంధనలు లేవు
– ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు
– అధ్యయనంలో వెల్లడైన గిగ్ వర్కర్ల సమస్యలు
న్యూఢిల్లీ : దేశంలోని గిగ్ వర్కర్ల విషయంలో ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టిని సారించటం లేదు. దీంతో వారు నిబంధనలు, సామాజిక భద్రత లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం.. యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్‌లలో దాదాపు మూడింట ఒక వంతు మంది రోజుకు 14 గంటలకు పైగా పని చేస్తారు. అయితే 83 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు 10 గంటల కంటే ఎక్కువ, 60 శాతం మంది 12 గంటలకు పైగా పని చేస్తారు. ఈ రంగంలో సామాజిక అసమానతలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఎస్సీ, ఎస్టీల నుంచి 60 శాతానికి పైగా డ్రైవర్లు రోజుకు 14 గంటల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. అయితే ఉన్నతవర్గాల నుంచి మాత్రం 16 శాతం మంది మాత్రమే ఎక్కువ గంటలు పని చేస్తున్నారు. యాప్ ఆధారిత కార్మికులకు బలమైన సామాజిక భద్రత అవసరాన్ని అధ్యయనం నొక్కి చెప్పింది. అలాంటి కార్మికులను పర్యవేక్షించడానికి ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించే అల్గారిథమ్‌లు, మెకానిజమ్‌ల న్యాయబద్ధతపై ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలని అధ్యయనంలో భాగమైన పరిశోధకులు పిలుపునిచ్చారు.
పీపుల్స్ అసోసియేషన్ ఇన్ గ్రాస్‌రూట్ యాక్షన్ అండ్ మూవ్‌మెంట్స్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఫ్రెడరిచ్-ఎబర్ట్-స్టిఫ్టంగ్ ఇండియా, జర్మన్ ఫౌండేషన్ నుంచి సాంకేతిక సహకారంతో నిర్వహించాయి.
తక్కువ జీతం.. ఎక్కువ పని గంటలు
అధ్యయనంలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది తమ ఖర్చులన్నింటినీ తీసివేసిన తర్వాత రోజుకు రూ.500, నెలకు రూ. 15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నామని తెలిపారు. యాప్ ఆధారిత డెలివరీ వ్యక్తులలో 34 శాతం మంది నెలకు రూ. 10 వేల కంటే తక్కువ సంపాదిస్తున్నారనీ, వారిలో 78 శాతం మంది ప్రతిరోజూ 10 గంటల కంటే ఎక్కువ సమయం పనిలో గడుపుతున్నారని తేలింది.ఈ ఆదాయ అసమానతలు ఇప్పటికే ఉన్న సామాజిక అసమానతలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ వర్గాలలో పేదరికం, బాధలను శాశ్వతం చేస్తున్నాయి. మొత్తమ్మీద, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, లక్నో, కోల్‌కతా, జైపూర్, ఇండోర్ అనే ఎనిమిది నగరాల్లో 5302 మంది క్యాబ్ డ్రైవర్లు, 5028 మంది డెలివరీ వ్యక్తులు 50 ప్రశ్నల సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 78 శాతం మంది 21 నుంచి 40 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు.