సామాజిక భద్రతే పెన్షన్‌

సామాజిక భద్రతే పెన్షన్‌సుమారు గత 40 సంవత్సరాలుగా భారతదేశ వ్యాపితంగా వున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పెన్షనర్లు డిసెంబర్‌ 17వ తేదీన పెన్షనర్స్‌ డే నిర్వహించుకుంటున్నారు. ఆ రోజు కొన్ని సంఘాలు ప్రదర్శనలు నిర్వహించడం, సెమినార్లు, సభలు, మోస్ట్‌ సీనియర్లను శాలువాలతో సత్కరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. పెన్షనర్లను చైతన్య పరిచే పనులు చేస్తుంటాయి.
గతంలో కేంద్ర ప్రభుత్వం సవరించిన పెన్షన్‌ ఆర్థిక ఇతర ప్రయోజనాలను 31 మార్చి, 1979 నాటికి సర్వీసులో వున్న వారికే వర్తిస్తాయని, అంతకు పూర్వం రిటైరయిన వారికి వర్తించవని 26 మే, 1979న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది పెన్షన్‌ దారులను కుంగదీసింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, రక్షణ శాఖల్లో పనిచేసి రిటైరయిన ఉన్నతోద్యోగులు డి.ఎస్‌.నకారా, మరికొందరు మన దేశ సర్వోన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ వేశారు. ఆనాటి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌ అధ్యక్షతన మరో నలుగురు న్యాయమూర్తులు, ఒ.సిన్నపరెడ్డి, హరూల్‌ ఇస్లాం, వి.డి.తుల్జాపూర్కర్‌, డి.ఎ.దేశారు లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దీనిని సంపూర్ణంగా విచారించింది. పూర్వాపరాలను అనేక పూర్వ తీర్పులను పరిశీలించి,
1. పెన్షన్‌ అనేది యజమాని ఇష్టాయిష్టాలపై దయతో ఇచ్చే దానం కాదని, అది పించను దారుని స్థిరమైన హక్కు అని,
2. గతంలో 30 – 40 సంవత్సరాలు అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించబడే వాయిదా పడిన వేతనం అని,
3. పదవీ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖసంతోషాలతో తాను గౌరవ ప్రదంగా జీవించడానికి కల్పించబడిన సామాజిక భద్రత అని చెప్పింది.
దీనిని నిర్ణయించడం, కాలానుగుణంగా పెంచడం, సర్వీసులోని వారి వేతనాలతో పాటు సవరించడం యాజమాన్యాల, ప్రభుత్వాల బాధ్యత అని చెప్పింది. దీనిని విజయం సాధించిన దినంగా పెన్షనర్లు విజయోత్సవం జరుపుకుంటున్నారు. కాని 2004 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వం (ఒక్క సాయుధ బలగాలకు తప్ప) మన రాష్ట్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్‌ 1 నుండి రాష్ట్రంలో నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం అమలు చేయడం జరిగింది. ఆనాటి వామపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అమలు చేయలేదు.
ఇప్పటికీ అనేక సమస్యలు పునరావృతం అవుతూనే వున్నాయి. నకారా స్ఫూర్తితో పెన్షనర్లు సుసంఘటితమై పోరాటాలు చేస్తూనే వున్నారు. 1998కి పూర్వం రిటైరైన వారి పెన్షన్‌ లెక్కింపు 10 నెలల సగటు వేతనంపై లెక్కించేవారు. ఆ తర్వాత వారికి చివరినెల వేతనంలో సగంగా లెక్కిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి పూర్వం వారి పెన్షన్‌ లెక్కింపు కూడా చివరి జీతంలో సగంగా సాధించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతన సవరణలు ఆలస్యం అయితే (ఐ.ఆర్‌.) మధ్యంతర భృతినిస్తాయి. 1996లో కేంద్ర ప్రభుత్వం, 1998లో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద విధానంలోవుండే యు.జి.సి.వారికి ఇవ్వలేదు. పెన్షనర్లు పోరాటం చేసి ఐ.ఆర్‌. సాధించుకున్నారు.
ప్రపంచబ్యాంకు ఐ.ఎం.ఎఫ్‌ల మానస పుత్రిక నూతన పెన్షన్‌ విధానం. దీనిని మన దేశంలో చట్టం చేయకుండానే 2004 నుండి అమలు చేస్తున్నారు. వామపక్షాల బలంతో 10 ఏళ్లపాటు చట్టం కాకుండా అడ్డుకున్నారు. చివరకు 2013లో కాంగ్రెస్‌, బి.జె.పి. కుమ్మక్కై పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎ బిల్లు (పెన్షన్‌ ఫండ్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అధారిటీ) ఆమోదించారు. 20 ఏండ్లుగా అటు ఉద్యోగులు, పెన్షనర్లు పోరాడుతూనే వున్నారు.
చివరకు రాజకీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రయోజనాల కోసం రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, కర్షాటక, తెలంగాణ వంటి చోట్ల ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పాత పెన్షన్‌ అమలు చేస్తామని ప్రకటించాయి. ఉద్యోగ, పెన్షన్‌ సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి.
చివరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా నూతన పెన్షన్‌ విధానంలో వున్న వారి కోర్కెలను పరిశీలించి కొన్ని మార్పులు సూచించడానికి ఒక కమిటీని ప్రతిపాదించినట్లు మార్చి 2023లో ప్రకటించారు. ఇదొక రాబోయే ఎన్నికల జిమ్మిక్కు.. దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని, సగటు ఆయుర్ధాయం కూడా పెరుగుతుందని, పెన్షన్‌ భారం ప్రభుత్వాలు తగ్గించుకోకపోతే బండి నడవదని ప్రపంచ బ్యాంకు హెచ్చరిస్తున్నది. రిటైర్‌మెంట్‌ వయసు కూడా పెంచాలని అంటున్నారు. అమెరికాలో 67కు, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, లండన్‌, జెకోస్లేవేకియా 70 కి, 75 కి కూడా పెంచాలని మరికొందరంటున్నారు.
ఇప్పటికీ ఇ.పి.ఎఫ్‌. కనీస పెన్షన్‌ 1000 రూపాయలుగా వుంది. కోల్‌ మైన్స్‌లో కనీస పెన్షన్‌ 360/- గా వుంది. వారికి గత 28 సంవత్సరాలుగా కరువు బత్తెం లేదు. పెన్షన్‌ సవరణ లేదు. వైద్య సౌకర్యాలు లేవు. పెన్షన్లలో అధికారులకు, కార్మికులకు అనేక అసమానతలు కొనసాగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు చైతన్యంతో, సమైక్యతతో మార్పు కోసం పోరాడాలనే స్ఫూర్తి ఈ పెన్షనర్స్‌డే ద్వారా పొందాలి.
– ఎం. రంగయ్య, 9951540430
ఉపాధ్యక్షులు, టి.ఎ.పి.ఆర్‌.పి.ఎ