– వైరలవ్వాలి..బద్నాం చేయాలి
– గోరంతలు కొండతలుగా చిత్రీకరణ
– అభ్యర్థులు సైతం వార్ రూమ్‌లు తెరుస్తున్న వైనం
– పలుకుబడి ఉన్న యూట్యూబర్లు, గ్రూప్ అడ్మిన్ల కోసం వెతుకులాట
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ వార్ అదుపు తప్పుతోంది. ఎదుటి వారి మాటలు, ప్రచారాలు, తప్పొప్పులను పట్టేసి వాటికి మసాలాలు జోడించి కొందరు యూట్యూబర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. గొరంతల్ని కొండంతలుగా చిత్రీకరిస్తూ… ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులపై ఏహ్యభావం, తమ వారిపై సానుకూల దక్పథం కలిగేలా సినిమా దశ్యాలను, ఫొటోలను జోడించి ఊదర గొడుతున్నారు. ఇందు కోసం పార్టీలతో పాటు అభ్యర్థులు సైతం వార్ రూంలను తెరుస్తున్నారు. పలుకుబడి ఉన్న యూ ట్యూబర్లు, గ్రూప్ అడ్మిన్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ స్థాయిలోనే కాకుండా, అభ్యర్థులు సైతం వార్ రూంలను తెరుస్తున్నారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో ప్రసారానికి వీలులేని బూతులు, వివాదాస్పద వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో యథేచ్ఛగా పోస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కరువుపై ఆన్‌లైన్ సాక్షిగా రచ్చ జరుగుతోంది. కాలం తెచ్చిన కరువని కాంగ్రెస్ అంటుంటే, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువని బీఆర్‌ఎస్ ఏకి పారేస్తోంది. పంటల సాగు, నీటి ఎద్దడి, కరవు, రైతు ఆత్మహత్యలు, తాగునీటి సమస్యలు, ఎండిపోయిన జలాశయాలు, వర్షాభావం తదితర సమాచారం, చిత్రాలు, వీడియోలను పోస్టు చేసి ప్రత్యర్థులకు ఊపిరిసలపకుండా చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రచారం పీక్ స్టేజికి చేరుకుంది. మాటల తూటాలు, విమర్శల బాణాలు, బూతుపురాణాలు జోరందుకుం టున్నాయి. గతేడాది చివర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రచారం తీరు తారస్థాయికి చేరినా.. వ్యాఖ్యల తీవ్రత ఇప్పటిలా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కోర్టు కేసులు, అరెస్ట్‌లకు సంబంధించి పలు చిత్రాలు, వ్యాఖ్యలను కొన్ని పార్టీల నాయకులు యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఉన్న అభ్యర్థులు అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. ఫలితంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం క్షేత్రస్థాయిలో కంటే సోషల్ మీడియా వేదికగానే ఎక్కువగా యుద్ద రంగాన్ని తలపిస్తోంది.
యూట్యూబ్ ఛానళ్లకు పెరిగిన గిరాకీ
సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్, వాట్సాప్,ఎక్స్(ట్విట్టర్),ఇన్‌స్ట్రాగ్రామ్,టెలిగ్రామ్ తదిత ర సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి స్పందన ఎక్కు వగా ఉండటంతో పార్టీలు, అభ్యర్థులు వాటిపై ఆధార పడుతున్నారు.ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న గ్రూపులు,యూట్యూబ్ వార్తా ఛానళ్లకు గిరాకీ పెరిగింది. గత ఎన్నికల్లో కేటీఆర్, రేవంత్‌రెడ్డి తదితర ముఖ్యనేతలు ప్రత్యేక ఇంటర్వూలకు ప్రాధాన్యం ఇచ్చారు. బీజేపీ,కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సొంతంగా వార్‌రూంలు ఏర్పాటు చేసుకొని ప్రచారం చేస్తుండటం తో పాటు ఎంటర ్‌టైన్‌మెంట్, పొలిటికల్ కార్యక్రమాల ను ప్రసారం చేసే యూట్యూబ్ ఛానళ్లకు పెద్ద మొత్తాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకుం టున్నాయి. వాట్సప్, ఇన్‌స్టా, సిగల్ వంటి సామాజిక యాప్‌లలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న గ్రూపుల అడ్మిన్లను కూడా తికిపట్టుకుంటున్నారు.
శాసనసభ ఎన్నికల్లో సహకరించిన వారితోపాటు కొత్తవారి కోసం అన్వేషి స్తున్నారు.ప్రసారం చేయాల్సిన కంటెంట్‌ను పార్టీలు, నాయకులే రూపొందించి ఇస్తున్నారు.తాము కోరుకు న్న సమయంలో వాటిని యూట్యూబర్లు,గ్రూప్‌ల అడ్మిన్లు వారి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయా లని సూచిస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వదిలి పెట్టకుండా సోషల్ మీడియా వేదికగా అభ్యర్థు లు ప్రచారాన్ని హౌరెత్తిస్తున్నారు.
సోషల్ వార్…..మిస్ ఫైర్!
2:35 am