సోషలిజం – సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ప్రభాత్‌ పట్నాయక్‌ రాజ్యాంగ పీఠిక నుండి ‘సోషలిజం’ అన్న పదాన్ని తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ మీద నవంబరు 22న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు వ్యాఖ్యలు చేశారు. అవి ప్రాధాన్యత కలిగినవి. మొదటిది: రాజ్యాంగ పీఠికలో ‘సోషలిజం’ అన్న పదాన్ని ఒక సైద్ధాంతిక పరమైన ప్రాతిపదిక నుండి ఉపయోగించలేదని, అది ఒక సంక్షేమ రాజ్యాన్ని సూచించేదిగా, పౌరులందరికీ సమాన అవ కాశాలను గ్యారంటీ చేసే అర్ధంలో ఉపయోగించారని అన్నారు. రెండవది: ఈ అర్ధంలో సోషలిజం అనేది రాజ్యాంగ మౌలిక పునాదిలో అంతర్భాగంగా ఉంటుందని, ఏదో అదనంగా తోడు చేసిన పదంగా దానిని పరిగణించకూడదని, భారతీయ గణతంత్ర సమాజం ఏవిధంగా ఉండాలో దాని సారాంశంతో సోషలిజం అన్న పదం పెనవేసుకుని వుందని ఆయన అన్నారు.
సోషలిజం అన్న పదానికి ఒక వ్యవస్థీకృత అర్ధాన్ని ఇవ్వడానికి ప్రధాన న్యాయమూర్తి సంసిద్ధులు కాలేదు. ప్రపంచం మొత్తం మీద ‘సోషలిజం’ అన్న పదాన్ని ఉత్పత్తి సాధనాలను, – కనీసం కీలకమైన ఉత్పత్తి సాధనాలను సమాజ ఉమ్మడి ఆస్తిగా ఉంచడం అన్న అర్ధంలో వాడతారు. కాని ప్రధాన న్యాయమూర్తి ఆ అర్ధంలో కాకుండా, ఫలితం ప్రాతిపదికగా సోషలిజాన్ని నిర్వచించారు. ప్రయివేటు సంస్థలు మనుగడలో ఉండడం (అంటే ఉత్పత్తి సాధనాలు ప్రయివేటు ఆస్తిగా ఉండడం) అనేది సోషలిజానికి ఏవిధంగానూ ఆటంకం కాబోదని, ఎవరి ఆస్తి అన్నదానితో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సమాన అవకాశాలను గ్యారంటీ చేయగలిగే సంక్షేమ రాజ్యస్థాపనే ముఖ్యం అన్నది దాని భావం.
ఉత్పత్తి సాధనాల యాజమాన్యం ఎవరిది అన్న దాన్నిబట్టి సోషలిజాన్ని ఒక వ్యవస్థీకృత ప్రాతిపదికన నిర్వ చించడం సర్వత్రా ఉంది. అందరికీ సమాన అవకాశాలను గ్యారంటీ చేయాలంటే ముందు ఉత్పత్తి సాధనాలు సమా జపరం అవడం అవశ్యంగా జరగాలన్న అవగాహనతోటే ఆ విధంగా జరుగుతోంది. అయితే ప్రధాన న్యాయమూర్తి ఉత్పత్తి సాధనాలను సమాజపరం చేయకుండానే అందరికీ సమాన అవకాశాలను గ్యారంటీ చేయవచ్చునని సూచి స్తున్నారు. వాస్తవానికి సోషలిజం అన్నది కేవలం ఒక సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడం అన్న లక్ష్యంతో మాత్రమే పరి మితం కాదు. దాని లక్ష్యం అంతకన్నా చాలా విస్తృతంగా ఉంటుంది. సమాజంలోని తక్కిన మానవులతో సంబం ధాలన్నీ తెగిపోయి ఒంటరిగా మిగిలిపోయే వ్యక్తులతో నిండిన, ముక్క చెక్కలైన పరిస్థితిని పెట్టుబడిదారీ వ్యవస్థ కల్పిస్తుంది. ఆ పరిస్థితిని అధిగమించి ఒక నూతన సమాజాన్ని నిర్మించడం సోషలిజం లక్ష్యం. అటువంటి నూతన సమాజం అందరికీ సమాన అవకాశాలను గ్యారంటీ చేయగలిగి వుండడం కూడా అవశ్యంగా జరగాలి.
ఉత్పత్తి సాధనాలను సమాజపరం చేయకుండా అటువంటి సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడం సాధ్యమేనా అన్నది ఇక్కడ ప్రశ్న.
అది సాధ్యం కాదు అని మనం విశ్వసిస్తున్నాం. కాని, ఉత్పత్తి సాధనాలు ప్రయివేటు ఆస్తిగా ఉండడానికి, సమాన అవకాశాలను గ్యారంటీ చేయగలగడానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా చేయబోవడం లేదు. ప్రధాన న్యాయమూర్తి ప్రకటించినట్టుగా రాజ్యం పౌరులందరికీ సమాన అవకాశాలను గ్యారంటీ చేయగల గాలన్న అంశానికే సుప్రీంకోర్టు కట్టుబడి ఆ ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమాన అవకాశాలు అందరికీ ఉండే సమాజం ఏవిధంగా ఉండాలో పరిశీలించాలని కోరుతున్నాం.
ప్రస్తుతం భారత సమాజంలో ఒకపక్క సంపద కేంద్రీకరణ, మరొక పక్క నిరుద్యోగం, పౌష్టికాహారాన్ని సైతం పొందలేకపోతున్నంతగా పేదరికం పెరుగుతున్న పరిస్థితి ఉంది. అందుచేత మన సమాజం అందరికీ సమాన అవకాశాలను కల్పించే దిశగా నడుస్తోందని ఎవరూ వాదించలేరు. మరి ఆదిశగా నడుస్తోందని నిర్ధారించడానికి పరిగణనలోకి తీసుకోవలసిన సూచికలేమిటి?
నిరుద్యోగం లేదా మార్క్స్‌ చెప్పినట్టు శ్రామికుల రిజర్వు సైన్యం ఉన్నప్పుడు సమాజంలో సమాన అవకాశాలు ఉండ వన్నది స్పష్టం. ఒకవేళ నిరుద్యో గులకు భృతి కల్పించినా, ఆ నిరుద్యోగుల ఆదాయాలకు, కార్మికుల ఆదాయాలకు మధ్య తేడా ఎక్కువగానే ఉంటుంది. ఆ నిరుద్యోగుల సంతానం సైతం ఏమీ పొందలేని స్థితిలో ఉంటారు. వారికి, కార్మికుల సంతానానికి మధ్య సమాన అవకాశాలు గ్యారంటీ చేయడం అసాధ్యం.
నిరుద్యోగం వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతే కాకుండా నిరుద్యోగిగా ఉండడం అనేదే సమాజంలో ఒక శాపంగా పరిగణించబడే స్థితిలో, ఆత్మ గౌరవాన్నే కోల్పోయిన ఆ నిరుద్యోగుల సంతానం చిన్నతనం నుండే గాయపడ్డ మనస్సులతో జీవితాన్ని ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిని నివారించాలంటే, సమాన అవకాశాలను కల్పించాలంటే ముందు నిరుద్యోగాన్ని లేకుండా చేయాలి.
ఆర్థిక లేమిని తొలగించాలంటే అందుకు ఒక మార్గం నిరుద్యోగ భృతిని కూడా కార్మికులు పొందే వేతనంతో సమానంగా చెల్లించడం. కాని ప్రయివేటు సంస్థలు ఉండే వ్యవస్థలో ఇది అసాధ్యం. ప్రయివేటు రంగం గణనీయంగా కొనసాగే సమాజంలో- అది కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థే కానక్కరలేదు- నిరుద్యోగం ఉండడం అనేది కార్మికులను అదుపులో ఉంచే సాధనంగా ఉంటుంది. అందుచేత అటువంటి ఆర్థిక వ్యవస్థల్లో నిరుద్యోగులకు ఇచ్చే భృతి కార్మికులకిచ్చే వేతనాలతో సమానంగా ఉండడం ఆమోదయోగ్యం కాజాలదు. సమానంగా ఉంటే అప్పుడు నిరు ద్యోగం కార్మికులను అదుపులో ఉంచే సాధనంగా ఉండలేదు. పూర్తి స్థాయి ఉపాధి కల్పన జరిగిన సమాజంలో ఒక కార్మికుడిని పనినుండి తొలగించడం అనేది ఒక శిక్షగా ఉండలేదు. ప్రయివేటు సంస్థలు కొనసాడానికి, సమాన అవ కాశాలు గ్యారంటీ చేయాలన్న లక్ష్యానికి మధ్య ఉన్న మొట్టమొదటి వైరుధ్యం నిరుద్యోగం విషయంలోనే. ఈ విష యాన్ని ప్రధాన న్యాయమూర్తి అంగీకరించక పోయినప్పటికీ, సమాన అవకాశాలను గ్యారంటీ చేయడానికి నిరుద్యోగం ఆటంకం అని గుర్తించక తప్పదు.
సమాన అవకాశాలను గ్యారంటీ చేయాలంటే పరిగణించాల్సిన రెండో అంశం ఆస్తి వారసత్వాన్ని పూర్తిగా గాని దాదాపుగా కాని లేకుండా చేయడం. వారసత్వ హక్కు కొనసాగుతున్నప్పుడు ఒక శతకోటీశ్వరుడి కుమారుడు, ఒక కార్మికుడి కుమారుడు సమాన అవకాశాలను కలిగివున్నట్టు చెప్పలేం కదా. ఆ శతకోటీశ్వరుడి కుమారుడికి అప్పుడు ఆ కోట్లాది సంపద సంక్రమిస్తుంది. వాస్తవానికి బూర్జువా ఆర్థిక శాస్త్రం కూడా వారసత్వ హక్కును సమర్ధిం చలేదు. పెట్టుబడిదారులకు తక్కినవారికన్నా అదనంగా కొన్ని ప్రత్యేక సామర్ధ్యాలు ఉన్నందువల్లే వారికి లాభాలు సమకూరుతాయన్న ప్రాతిపదికన అది పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్ధిస్తుంది. దానివల్ల పోగుబడే సంపద మీద హక్కు అటువంటి ప్రత్యేక సామర్ధ్యంతో నిమిత్తం లేకుండా వారసత్వంగా ఆ పెట్టుబడిదారుడి సంతానానికి సంక్రమిం చడాన్ని ఏవిధంగా సమర్ధించగలుగుతుంది? అందువల్లే చాలా పెట్టుబడిదారీ దేశాల్లో వారసత్వ పన్ను రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. జపాన్‌లో అత్యధికంగా 55 శాతం ఉంటే, తక్కిన దేశాల్లో 40 శాతం దాకా ఉంది. కాని ఆశ్చర్య కరంగా భారతదేశంలో వారసత్వ పన్నే లేదు. మరి సమాన అవకాశాల కల్పనకు ఆస్కారం ఎక్కడుంటుంది?
ఇక సమాన అవకాశాలు కల్పించడానికి తేల్చాల్సిన మూడవ అంశం సంపద అసమానతలను కనీస స్థాయికి తీసుకురావడం. సంపద అంటే అధికారం. అందులో రాజకీయ అధికారమూ ఉంటుంది, సామాజిక అధికా రమూ ఉంటుంది. ఈ అధికారం సమానంగా పంపిణీ అయినప్పుడే సమాజంలో అందరికీ సమాన అవకాశాలను కల్పించినట్టవు తుంది. సంపన్నుల సంతానం తమ తల్లితండ్రుల జీవిత కాలంలో సమాజంలో తక్కిన వారి సంతానం కన్నా పైచేయి కలిగి వుండే పరిస్థితులుంటే సమాన అవకాశాల కల్పన అసాధ్యం అవుతుంది. అందుచేత తల్లిదండ్రుల అనం తరం వారసత్వంగా సంపద మీద హక్కు పొందే వీలును లేకుండా చేస్తే సరిపోదు, ఆ తల్లితండ్రుల జీవిత కాలంలో కూడా వారి వద్దనున్న సంపద కారణంగా ఇతరుల కన్నా పైచేయి కలిగివుండే స్థితిని కూడా మార్చాలి. అంటే సంపదలో అసమానతలను తొలగించాలి. సంపదలో అసమానతలను తొలగించడంతోబాటే ఆదాయాల్లో అసమాన తలను కూడా కనిష్ట స్థాయికి తేవాలి. అప్పుడు మాత్రమే సమాన అవకాశాలను అందరికీ గ్యారంటీ చేయడం సాధ్యం.
ఇక నాల్గవది: ఆర్థిక అసమానతల కారణంగా విద్య, నైపుణ్యం పొందే విషయంలో అందరికీ ఒకే విధమైన అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి ఉండకూడదు. అంటే అందరికీ విద్య, నైపుణ్యం పొందేందుకు సమాన అవకా శాలను కల్పించాలి. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థను పెంపొందించి అందరికీ నాణ్యత కలిగిన విద్యను ఉచితంగా కాని, నామక: ఖర్చుతో గాని అందుబాటులో ఉంచాలి. ఇప్పుడు నయా ఉదారవాద వ్యవస్థలో విద్య దాదాపు ప్రయివేటీ కరించబడింది. దీని వలన సమాన అవకాశాలు అన్న లక్ష్యమే అర్ధం లేనిది గా మారిపోయింది. అత్యధికులు విద్యా ర్ధులు నాణ్యత కలిగిన చదువుకు అంతకంతకూ దూరం అయిపోతున్నారు. ఒకపక్క ప్రభుత్వ విద్యా వ్యవస్థ కొనసాగు తున్నా, ఖరీదైన ప్రయివేటు విద్యావ్యవస్థ ఇంకోపక్కన ఉన్నందున, అది ఒక బూటకపు ప్రతిష్టను సంతరించుకు న్నందున, ఆ ప్రయివేటు విద్యాసంస్థల నుండే అధికంగా ఉపాధికల్పన అవకాశాలు లభిస్తున్నందున సమాన అవకాశాల కల్పన అనేది అసాధ్యం అయిపోతున్నది. దీనిని నివారించాలంటే ఆ ప్రయివేటు సంస్థలు కూడా ప్రభుత్వ సంస్థలతో సమానంగా ఫీజులు వసూలు చేయాల్సిందేనన్న నిబంధనలు పెట్టాలి. దానర్ధం అవి దాతృత్వ సంస్థలుగా మాత్రమే పని చేయాలి.
మరి అయిదవది: ఇది వైద్య, ఆరోగ్య కల్పనకు సంబంధించినది. ఇక్కడ కూడా విద్యకు వర్తించిన సూత్రాలే వర్తించాలి. సార్వత్రిక, నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ కల్పించినప్పుడే సమాన అవకాశాల కల్పన సాధ్యం. ఇది జరగాలంటే జాతీయ వైద్య సంరక్షణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి. అక్కడ ఉచితంగా కాని, నామమాత్రపు రుసుముతో ఆని అందరికీ వైద్యం అందాలి.
పౌరులందరికీ సమాన అవకాశాలు గ్యారంటీ కావాలంటే పైన సూచించినవి కొన్ని కనీస అవసరాలు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో సంక్షేమ రాజ్య వ్యవస్థను సోషల్‌ డెమాక్రసీ చేపట్టి కీన్స్‌ సిద్ధాంతానికి అనుగుణంగా నిరుద్యోగాన్ని కనీస స్థాయిలో ఉంచింది (1960 దశకంలో బ్రిటన్‌లో నిరుద్యోగం రెండు శాతం మాత్రమే ఉండేది). అయినప్పటికీ ఆ వ్యవస్థ పౌరులందరికీ నిజమైన అర్ధంలో సమాన అవకాశాలను గ్యారంటీ చేయ లేకపోయింది. అంతేకాక ఆ విధానాన్ని దీర్ఘకాలంపాటు కొనసాగించలేకపోయింది (1960, 1970 దశకాల్లో తలెత్తిన దవ్య్రోల్బణ సంక్షోభాన్ని అది తట్టుకోలేకపోయింది. దాంతో అది కుప్పకూలింది). వర్గాలుగా చీలివున్న సమాజంలో అందరికీ సమాన అవకాశాలను గ్యారంటీ చేయడం అసాధ్యం అని ఆ సంక్షేమ రాజ్య అనుభవం నేర్పుతున్నది.
వలస విధానం అంతమైన తర్వాత పెట్టుబడిదారీ దేశాలకు ముడి సరుకుల మీద పెత్తనం లేకుండా పోయింది. దాని వలన ఆ దేశాలలో వర్గ వైరుధ్యాలు తీవ్రమయ్యాయి. దాని పర్యవసానంగా తీవ్ర స్థాయిలో ద్రవ్యోల్బ ణం పెరిగింది. అటువంటి వర్గ వైరుధ్యాలు లేని సమాజంలో మాత్రమే, అంటే ఉత్పత్తి సాధనాలు ప్రయివేటు ఆస్తిగా కాకుండా సమాజపు ఉమ్మడి ఆస్తిగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన అర్ధంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం సాధ్యం. అయితే ఇప్పుడు ఈ విషయం మీద చర్చ లేవనెత్తడం కన్నా అందరికీ సమాన అవకాశాలను కల్పించే సంక్షేమ వ్యవస్థ ఉండాలన్న సుప్రీం కోర్టు వైఖరికే అది కట్టుబడి వుండాలని కోరుకుందాం. ఆ దిశగా ముందుకు పడే అడుగులు సోషలిజం దాకా వెళ్ళకపోయినప్పటికీ, ఏ మేరకు పడినా అది సోషలిస్టులందరూ స్వాగతించాల్సిందే.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌