‘హితేన సహితం సాహిత్యం’ అని మన పూర్వీకులు సాహిత్యాన్ని నిర్వహించారు. అంటే హితాన్ని చేకూర్చేదే సాహిత్యం. అయితే ఈ హితం ఎవరికోసం? ఎందుకోసం? అన్న కోణాల్లో పరిశీలించినప్పుడు ఆయా వర్గ ప్రయోజనాలను అనుసరించి సాహిత్యం పలు శాఖలుగా చీలిపోతుంది.కష్టజీవికి ఇరువైపులా నిలిచే వాడేకవి అని శ్రీశ్రీ అంటే, సామాన్యుడి కన్నీళ్లను తుడవనిది అసలు సాహిత్యమే కాదన్నారు శేషేంద్ర.కవిత్వం రాయడానికి నిరుపహతి స్థలంబు రమణి ప్రియ దూతిక.. అంటూ అలనాడు అల్లసాని పెద్దన్న తనకు కావలసిన సరంజామా వివరిస్తే, అడుగడుగునా చెరసాలలు..సంకెళ్లు, లాఠీలు, తూటాలు, నిరసనలు, నిర్బంధాలు, ఎమర్జెన్సీ పేరుతో దేశంలో అత్యవసర పరిస్థితి (1975-77) అట్టుడికి పోతున్నకాలంలో ఆంక్షలను, అడ్డంకులను అధిగమించి నిర్భయంగా శేషేంద్ర వివిధ పత్రికలలో వెలువరించిన వచన కవితల సమాహారమే ‘గొరిల్లా కావ్యం’గా రూపుదిద్దుకుంది. తదనంతర కాలంలో వెలువడిన ”ఆధునిక మహాభారతం”లో ఇది పశుపర్వం పేరుతో చోటుచేసుకుంది.ఎమర్జెన్సీ కాలంలోనే గొరిల్లా ఇంగ్లీషు, హిందీ అనువాదాలు కూడా వెలువడ్డాయి.వాస్తవానికి శేషేంద్ర సంప్రదాయ సిద్ధమైన, ఛందోబద్దమైన పద్య కావ్యాలు రాస్తున్న రోజుల్లోనే ఆయన హృదయం అభ్యుదయ భావజాలంతో నిండిపోయింది.
కులగోత్రమ్ములు లేవు మాకు
ధనిక క్రూర క్రియా పీడిత
జ్వలిత ప్రాణిచమూ సమూహమొకటే
సత్యంబు, ఊహ భుజార్గళముల్
విప్పిన విశ్వమూర్తియయి
శంఖారావముంజేయుడో
దళిత శ్రామిక జీవులార!
భువన ద్వారంబు భేదిల్లగన్!
ఎమర్జెన్సీకి పాతిక సంవత్సరాల ముందు ఆయన రాసిన ”పక్షులు” అనే కావ్యంలోని పద్యమిది.గొరిల్లాను మానవుని లోని క్రియాశక్తికి ప్రతీకగా శేషేంద్ర స్వీకరించారు. సహజంగా ఎంతో సాత్వికంగా ఉండే గొరిల్లా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం తన ప్రతిచర్యతో పూర్తి హింసా త్మకంగా మారిపోతుంది. అలాగే తీవ్రమైన అణచివేతలకు గురువుతున్న అట్టడుగు వర్గాలు సంకెళ్లు తెగతెంచుకుని సాయుధ పోరాటానికి సిద్ధం కావాలన్నా వామపక్ష భావజాలానికి తన ప్రజాసాహిత్యంతో వెన్నుదన్నుగా నిలిచారు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. శేషేంద్ర ప్రౌఢ ప్రబంధాలను ఆవాహనం చేసుకున్న అలంకారిక పద్య కవి. రుతుఘోష,చంపూ వినోదిని, సొరాబు వంటి పద్య కావ్యాలు, కవిసేన మేనిఫెస్టో, కాల రేఖ, శోడశి, స్వర్ణ హంస, సాహిత్య కౌముది, వివేచన, నరుడు-నక్షత్రాలు మొదలైన గ్రంథాలెన్నో రచించిన నిలువెత్తు సారస్వత మూర్తి శేషేంద్ర.అయినా ఆయన ఏదో దివిలో విరిసిన పారిజాతమై ఎగిరిపోకుండా చైతన్య జలపాతమై, పీడిత తాడిత ప్రజానీకంతో మమేకమైన మహాకవిగా తన సాహిత్యాన్ని సార్ధకం చేసుకున్నారు.
”నా భాషలో భూకంపం పుట్టింది”
అని సంప్రదాయ ధోరణులను వ్యతిరేకిస్తూ..
నేను జేబుల్లో కోకిలల్ని వేసుకు రాలేదు
పిడికిటలో బాంబులు బిగించుకొని వచ్చాను
అంటూ తన సంక ల్పాన్ని ఆవిష్కరిస్తూ..
నా కవిత్వం ఏ జెండాను ఎగరేయదు కానీ
నా చేతులు నా దేశపు ఖడ్గాలు
అని సగర్వంగా ప్రకటించిన సారస్వత ధీరోదాత్తుడు శేషేంద్ర. శేషేంద్ర సృజనలో హంసతూలికా తల్పాలు, ప్రణయపారవశ్యపు పాలరాతి శిల్పాలు కనిపించవు .ఆయన కాల్పనిక ప్రపంచంలోనూ తుమ్మెదలు, చకోర పక్షుల కన్నా ప్రజా జీవితమే కనిపిస్తుంది.
నా కన్నుల్లో కనిపిస్తున్నాయి భావితరాలు
ప్రభాతం రాల్చిన కిరణాల గింజలు
ముక్కుతో పొడుచుకు తింటున్న
కోడిపుంజుల కుటుంబాల్లా
ఇలా అలంకారాల్లోనూ అభ్యుదయం తళుక్కుమనటం ఆయన ప్రత్యేకత. వర్గ వైరుధ్యాలను, సామాజిక ఆర్థిక శాస్త్రాలను అవగాహన చేసుకున్న సాహితీవేత్తగా శేషేంద్ర అడుగడుగునా గోచరిస్తారు.
తెలుసా నీ వ్యాధి ఏమిటో? బతుకు
దానికి మందు ఏమిటి? మెతుకు
ఇలా సమాజంలోని సమస్యను,
దాని మూలాన్ని అన్వేషించిన దార్శకునిగా..
అదిగో ఉదయించే దిక్కు
దానికే హృదయపూర్వకంగా మొక్కు
అంటూ, ఆ సమస్య పరిష్కారానికై దిశా నిర్దేశం చేస్తున్న మార్గదర్శిగా..
అడవుల్లో ఉరితీసిన వీరుడిలా ఉదయపు చెట్లలో వేలాడుతున్నాడు సూర్యుడు
అంటున్న యథార్థవాదిగా.. పాలక వర్గాలలోక విరోధిగా
అస్తమించనీకుండా అరచేత్తో
ఎత్తి పట్టుకొని మిత్రమా
నీ గుండెలో మెరిసే నక్షత్ర మండలాన్ని
అంటూ కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్న ఉద్యమకారునిగా..
నీ కాళ్ల సంకెళ్లు తెగిపోవాలని
నీ చేతుల్లో ఖడ్గాలు మెరవాలనీ దీవిస్తున్నాను
పద నిర్భయంగా
నీ దీపాలన్నీ వెలిగించబడే ఉన్నాయి
అంటూ ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తున్న శ్రామిక శ్రేయోభిలాషిగా శేషేంద్ర చరితార్ధులయ్యారు. శేషేంద్ర హృదయ స్పందనగా భావించే జగత్ ప్రసిద్ధమైన ఈ కవితాత్మక వాక్యాలు గొరిల్లా కావ్యంలోనివే !
సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు
తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు
పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు
నేనంతా ఒక పిడికెడు మట్టే కావచ్చు
కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది
అక్రమాలపై శేషేంద్ర పూరించిన ఈ ధిక్కార స్వరం కాలగమనంలో ఎందరో ఉద్యమవీరులకు, రాజ నీతిజ్ఞులకు ఉత్పేరక శక్తిగా నిలిచింది.
ప్రభాతం పసిదిగా ఉన్నప్పుడు
సనాతనగంగలో స్నానం చేశాడు మానవుడు
ఇప్పుడు మధ్యందిన మార్తాండ మండలాన్ని ఉపాసిస్తున్నాడు.
ఇదీ శేషేంద్ర దర్శనం. ఆయన ఆశయం నిరంతర పురోగమనం.
ఆయన సాహిత్యం ఇంగ్లీషు, హిందీ, కన్నడం ఉర్దూ, బెంగాలీ, నేపాలి, గ్రీకు భాషల్లో అనువదించబడ్డాయి. ఆ విధంగా శేషేంద్ర విశ్వకవి. అస్తమయంలేని రవి.శేషేంద్ర తన సాహిత్యంలో అప్సరోభామినులను అలంకరించలేదు. రాసలీలలను రసరమ్యంగా వర్ణించనూ లేదు. ఆయన తన కవితాత్మక పదమాలికలను, కార్మిక కర్షకులకు కండువాలుగా కప్పారు.ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగే తలపాగాలుగా చుట్టారు.
నా మాటలు ఈ దేశపు మట్టిలో చల్లుతున్నా
అన్నిచోట్ల కత్తులు మొలవాలని
అలా కత్తులుగా మొలిచిన శేషేంద్ర మాటలు మానవత్వం పరిమళించే తోటలై, యువశక్తిని నవయుగం వైపుకు నడిపించే బాటలై, సారస్వత విలువలను సంరక్షించే దుర్భేద్యమైన కోటలై ఈ శతాబ్ది చైతన్య స్రవంతిలో అంతర్లీనమయ్యాయి.
ఇదీ శేషేంద్ర సంకల్పం.
ఇదీ శేషేంద్ర స్వామ్యవాద సాహిత్య శిల్పం.
(నేడు 97వ జయంతి)
– డా.వెనిగళ్ల రాంబాబు, 98480 44329
సామ్యవాద సాహిత్య శిల్పం… ‘శేషేంద్ర గొరిల్లా కావ్యం!’
11:18 pm