విద్యతోనే సమాజ మార్పు

విద్యతోనే సమాజ మార్పు– ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
– రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలి
– కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను అమలు చేయాలి: విద్యాపరిరక్షణ కమిటీ నేతలు హరగోపాల్‌, చక్రధర్‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కె చక్రధర్‌రావు, ప్రధాన కార్యదర్శి జి హరగోపాల్‌ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ సర్కారుకు సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేయాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల వరకు విద్యారంగంపై విస్తృతంగా చర్చ జరుపుతామని చెప్పారు.
ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యార్థి, యువజన సంఘాలతోపాటు విద్యావేత్తలు, రాజకీయ పార్టీల నాయకులను భాగస్వాములను చేస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రధర్‌రావు, హరగోపాల్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేండ్లపాటు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. సరిపోయినన్ని నిధులు కేటాయించలేదనీ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదని చెప్పారు. ప్రయివేటు విద్యారంగాన్ని ప్రోత్సహించిందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో విద్యావిధానంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రయివేటు విద్యారంగాన్ని నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. విద్యాకమిషన్‌ను వేయాలన్నారు. తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కె లక్ష్మినారాయణ, నాయకులు వై అశోక్‌కుమార్‌, పి నాగిరెడ్డి, ఎం సోమయ్య, కెఎస్‌ ప్రదీప్‌, ఎంఎన్‌ కిష్టప్ప, ఎం పరశురాం, పి మహేష్‌, పెద్దింటి రామకృష్ణ, అల్లూరి విజరు మాట్లాడుతూ వ్యవసాయ విద్యాలయానికి చెందిన వందెకరాలను హైకోర్టు నూతన భవనానికి కేటాయించడం సరైంది కాదన్నారు. ప్రస్తుతమున్న హైకోర్టు అందరికీ అందుబాటులో ఉందనీ, ఆ స్థలం సరిపోతుందని చెప్పారు. నూతన భవనాన్ని నిర్మించాలంటే వర్సిటీ భూమి కాకుండా ఇతర చోట కట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులపై తీవ్రమైన పనిభారం ఉందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం రాగిజావను ఉపాధ్యాయులే పర్యవేక్షించాలనీ, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టులను పంపించాలని అన్నారు. ఇవన్నీ చేస్తే ఉపాధ్యాయులు చదువెప్పుడు చెప్పాలని ప్రశ్నించారు. అందరికీ ఉచిత, సమానమైన విద్య అందేవరకు పోరాడతామని చెప్పారు.
డిమాండ్లు :
ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో తక్షణమే విద్యా వాలంటీర్లను, స్కావెంజర్లను నియమించాలి.
రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలి. ఆ నిధులను ప్రభుత్వ విద్యాసంస్థల కోసమే ఖర్చు చేయాలి.
రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలి. పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలి.
విద్యార్థులందరికీ ఉదయం అల్పాహారంతోపాటు సాయంత్రం అరటిపండ్లు, పాలు ఇవ్వాలి. హోంవర్క్‌ను పాఠశాలలోనే చేయించిన తర్వాత పిల్లలను ఇంటికి పంపాలి.
మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలి. అవసరమైన వంట మనుషులను రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించాలి. వందేమాతరం ఫౌండేషన్‌కు ఇచ్చిన కాంట్రాక్టును సమీక్షించాలి.
ఉన్నత పాఠశాలలన్నింటినీ కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో మౌలిక వసతులతోపాటు హాస్టల్‌ వసతి, ఇతర విద్య, వైద్య అవసరాలను కల్పించి అభివృద్ధి చేయాలి. స్టాఫ్‌ ప్యాటర్న్‌ ప్రకారం అన్ని సబ్జెక్టులకూ రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలి.
తరగతి గదికొక టీచర్‌, బడికి ఒక ప్రధానోపాధ్యా యుడు ఉండాలి. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే నింపాలి.
అన్ని జిల్లాలకు డీఈవో, డిప్యూటీఈవో, అన్ని మండలాలకు ఎంఈవోలను నియమించాలి.
హేతుబద్ధీకరణ, రీలొకేషన్‌, ఏకీకరణ పేరుమీద మూసిన పాఠశాలలన్నింటినీ వెంటనే తెరిపించాలి.
కాంట్రాక్టు, గెస్ట్‌ లెక్చరర్లను వారి అర్హతలు సర్వీసు ప్రాతిపదికన సామాజిక న్యాయాన్ని పాటిస్తూ రెగ్యులరైజ్‌ చేయాలి.
ప్రతి ప్రభుత్వ కళాశాలకు దగ్గరగా ఉచిత హాస్టల్‌, ఉచిత మెస్‌ వసతులు కల్పించాలి. విద్యార్థులకు విద్యాసంబంధ అవసరాల కోసం ఉపకార వేతనాలను మంజూరు చేయాలి.
కొత్తగా ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వరాదు.
ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఉన్నతి వంటి అశాస్త్రీయ ప్రయోగాలను విడనాడాలి.
బాసర త్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి.