మెత్తబడ్డ అఖిలేశ్‌

మెత్తబడ్డ అఖిలేశ్‌– కాంగ్రెస్‌ పట్ల సానుకూల వైఖరి
– ఆ పార్టీతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని వెల్లడి
లక్నో : కాంగ్రెస్‌ పట్ల కొంత ఆగ్రహంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చల్లబడ్డారు. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని అఖిలేశ్‌ తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో సీట్ల పంపకంపై కాంగ్రెస్‌, ఎస్పీ మధ్య వాగ్వాదం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా అఖిలేశ్‌ ఒక మెట్టు దిగివచ్చి కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఓడిస్తానని చెప్పటం గమనార్హం. ”సమాజ్‌వాదీ పార్టీ మొదటి రోజు నుంచి బీజేపీతో పోరాడాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మేము ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకున్నప్పుడల్లా గౌరవంగా కలిసి వచ్చాము” అని అఖిలేశ్‌ యాదవ్‌ లక్నోలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌, ఎస్పీలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయాయి. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌కు తగిన సమాధానమిస్తాననీ, అది (కాంగ్రెస్‌) బలవంతపు ద్రోహి అని అఖిలేశ్‌ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇలాంటి తరుణంలో ఎస్పీ, కాంగ్రెస్‌ మధ్య స్నేహపూరిత వాతావరణం ఏర్పడటం ‘ఇండియా’ కూటమికి కలిసి వచ్చే విషయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.