– సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖంగా మాట్లాడుతున్నారు
– బండీ..దమ్ముంటే సుప్రీంలో సీనియర్ లాయర్‌ను పెట్టించి వాదించు : దాసోజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 ద్వారా గ్రూపు-1 ప్రిలిమినరీ క్వాలిఫై అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నోట్లో మట్టికొట్టిందని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా, మూర్ఖంగా మాట్లాడుతున్నారనీ, ఆయన అత్తెసరు చదువు చదువుకున్నారని విమర్శించారు. టీజీపీఎస్సీ చైర్మెన్ మహేందర్‌రెడ్డి, సీఎం కలిసి గ్రూపు-1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజరుకి ఫోన్ చేసిన రేవంత్‌రెడ్డి గ్రూపు-1 అభ్యర్థులను ఎందుకు కలవరని నిలదీశారు. బండి సంజరుకి, రేవంత్‌రెడ్డికి మధ్య సంబంధమేంటి? కేటీఆర్‌ను టార్గెట్ చేయాల్సిన అవసరం సంజరుకి ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు. కార్పోరేటర్ మనస్తత్వాన్ని బండి సంజరు, జెడ్పీటీసీ మనస్తత్వాన్ని రేవంత్‌రెడ్డి వీడటం లేదని విమర్శించారు. గ్రూపు-1 ప్రిలిమినరీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 60 ఉద్యోగాలను అదనంగా కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. దానికిగానూ 28,150 మందినే షార్ట్ లిస్టు చేయాలన్నారు. ఎవరికోసం ఈ హడావిడి పరీక్ష అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కంటే రేవంత్‌రెడ్డి గొప్పోడు కాడనీ, గతంలో ఎన్టీఆర్ ఇచ్చిన జీవోను 24 గంటల్లో వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేలోపు జీవోను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. రెండు నెలలు ఆలస్యమైతే ఇబ్బందేంటి? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అగ్రకుల మనస్తత్వంతో మహేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారనీ, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జీవో 55 అందరికీ న్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తున్నదనీ, రేవంత్‌రెడ్డి మూర్ఖత్వానికి మంత్రులు సమాధానాలు చెప్పాలని ప్రశ్నించారు.