– కేఎల్ శర్మ నుంచి యూసుఫ్ పఠాన్ వరకూ..
– కేంద్ర మంత్రులు.. మాజీ మంత్రులను ఓడించారు
న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలంగా దేశ రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ.. 2024-లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నది. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నా.. తక్కువగా అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ఇండియా బ్లాక్ అనూహ్య ఫలితాలు సాధించింది. సుదీర్ఘంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రముఖులు పలువురిని మట్టికరిచారు.
అమేథీ జెయింట్ కిల్లర్ కిశోర్‌లాల్ శర్మ
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి గత ఎన్నికల్లో తొలిసారి ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మతి ఇరానీ ఓటమి పాలయ్యారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిశోర్ లాల్ శర్మ విజయ బాట పట్టారు. 25 ఏండ్ల తర్వాత తొలిసారి అమేథీ నుంచి గాంధీయేతర నేత పోటీ చేసి గెలుపొందడం గమనార్హం.
బారాముల్లాలో ఫరూఖ్ అబ్దులాకు ఓటమి
జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఓటమిని అంగీకరించారు. బారాముల్లా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ గెలుపొందారు. ఇంజినీర్ రషీద్‌ను ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా అభినందించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు.
మెహబూబాపై ఆధ్యాత్మిక నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ గెలుపు
బకేర్వాల్, గుజ్జర్ సామాజిక వర్గాల నుంచి ఆధ్యాత్మిక నేతగా పేరొందిన మియాన్ అల్తాఫ్ అహ్మద్.. అనంత నాగ్ స్థానం నుంచి విజయం సాధించారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ పై ఆయన గెలుపొందారు.
భూపేష్ భాఘేల్‌ను మట్టి కరిపించిన సంతోష్ పాండే
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నందన్‌గావ్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే.. మాజీ సీఎం భూపేష్ బాఘేల్ మీద విజయం సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి పట్టు ఉన్న స్థానంగా రాజ్‌నందన్‌గావ్ నుంచి భూపేష్ బాఘేల్ ఓటమి పాలవ్వడం కాంగ్రెస్ పార్టీకి నిరాశనే మిగిల్చింది.
సుల్తాన్‌పూర్‌లో మేనకాగాంధీ ఔట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ ఓటమి పాలయ్యారు. ఆమెóపై ఎస్పీ అభ్యర్థి రాంభువాల్ నిషాద్ ఆధిపత్యం ప్రదర్శించారు. 2019లో బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్‌పై 15 వేల మెజారిటీతో గెలుపొందారు.
బహరాంపూర్ నుంచి అధీర్‌కు యూసుఫ్ పఠాన్ చెక్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బహరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరికి తణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి.. రాజకీయ అరంగ్రేటం చేసిన యూసుఫ్ పఠాన్ చెక్ పెట్టారు. అధీర్ రంజన్ చౌదరిపై యూసుఫ్ పఠాన్ విజయం.. మమతా బెనర్జీ కీలక గెలుపు.