– ఫిబ్రవరి 8న నిరసనకు ఏఐఏడబ్ల్యూయూ మద్దతు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా కేరళ సంఘీభావ డేగా జరపాలని ఏఐఏడబ్ల్యూయూ కేంద్ర వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవ్, బి.వెంకట్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదే రోజు బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత చర్యలకు వ్యతిరేకంగా కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీలో ఆందోళన చేయనున్నారని తెలిపారు. అలాగే అదే రోజున కేరళ ప్రజలు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనున్నారని అన్నారు.
ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలపై వివక్ష పూరిత చర్యల అమలుతో బీజేపీ ప్రభుత్వం సమాఖ్య వాదంపై దాడికి పాల్పడిందని విమర్శించారు. ప్రధానంగా కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడుతుందనీ, ఎందుకంటే కేరళ కార్పొరేట్ అనుకూల కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నదని తెలిపారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్నదని పేర్కొన్నారు. కేరళలో కూలీలకు రోజువారీ వేతనం అత్యధికమని, వ్యవసాయ కార్మికులకు రోజువారీ వేతనం రూ.764.3 కాగా, నిర్మాణ రంగ కార్మికులకు రోజువారీ వేతనం రూ.852.5 ఉందని తెలిపారు.
అందరికీ సామాజిక భద్రత హామీతో కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తోసుకెళ్తుందన్నారు. వ్యవసాయ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం కేరళ అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులకు సంక్షేమ బోర్డును కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అలాగే ఉపాధి హామీలో సోషల్ ఆడిట్‌ను అత్యుత్తమంగా నిర్వహించిందని తెలిపారు. నిత్యావసర వస్తువులతో ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేస్తుందన్నారు. కేరళలో నాణ్యతతో కూడిన విద్యా, వైద్యా వ్యవస్థలను బలోపేతం చేసిందని అన్నారు. దేశంలోనే మానవవనరుల అభివృద్ధి ఇండెక్స్‌లో కేరళ ముందుందని తెలిపారు. ఏడేండ్లలో కేరళలో వామపక్ష ప్రభుత్వం 2,34,567 భూ పట్టాలను పంపిణీ చేసిందన్నారు. ఆరేళ్లలో ఇళ్లులేని పేదలకు మూడు లక్షలకు పైగా ఇండ్ల పంపిణీ చేసిందన్నారు. అందులో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులేనని అన్నారు. ఈ పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వంపైనే కాకుండా, కేరళలోని కార్మిక, పేద ప్రజలపైన బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందని పేర్కొన్నారు.
అసైన్డ్ చట్టాన్ని మార్చొద్దు.. ఏపీలో ఆందోళనకు ఏఐఏడబ్ల్యూయూ మద్దతు : బి వెంకట్
ఏపీలో అసైన్డ్ చట్టాన్ని మార్చడాన్ని ఏఐఏడబ్ల్యూ యూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రకటించారు. శనివారం నాడిక్కడ ఏపీ, తెలంగాణ భవన్‌లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో జగన్ దళితుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శిం చారు. అసైన్డ్ భూముల లబ్ధిదారులు కోర్టుకు వెళ్లకుండా ఉండేలా నూతన చట్టాలు సవరించారనీ, విమర్శించారు. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా జరుగుతున్న ఆందోళనకు పూర్తి మద్దతును ప్రకటించారు.