తులసీచంద్‌కు సంఘీభావం

– సబ్రీనా సిద్దిఖీపై ట్రోళ్లు సరికాదు: టీడబ్ల్యూజేఎఫ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఇండిపెండెంట్‌ జర్నలిస్టు తులసిచంద్‌ను అసాంఘీక శక్తులు బెదిరించడాన్ని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ ఖండించింది. ప్రజా సమస్యలను వెలికితీయడం, కుల, మత, మూఢాచారాలకు వ్యతిరేకంగా తులసీ చేస్తున్న ప్రయత్నాన్ని, కృషిని అభినందించకుండా చంపేస్తామంటూ అవాకులు, చెవాకులు పేలడాన్ని తప్పుబట్టింది. మంగళవారం ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌ మూకలు నిజాయితీ కలిగిన స్వతంత్ర జర్నలిస్టు తులసీచంద్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని హెచ్చరించారు. ప్రతి జర్నలిస్టు ప్రజాసమస్యల పరిష్కారం కోసం వార్తలు, కథనాలు సమాజానికి అందిస్తుంటారనీ, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతుంటారని గుర్తు చేశారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. అలాచేయకుండా ఇష్టారాజ్యంగా ఫోన్‌కాల్స్‌ చేయడం ద్వారా వ్యక్తులను అసభ్యంగా దూషించడం, ట్రోల్‌ చేస్తూ అవమానించడాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని అన్నారు. చట్టాన్ని ఉపయోగించుకోకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే ఫెడరేషన్‌ సహించదని ప్రకటించారు. తులసీచంద్‌పై వేధింపులకు పాల్పడటాన్ని ఖండిస్తూ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
మోడీని ప్రశ్నించొద్దా..?
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ విలేకర్లతో మాట్లాడిన సందర్భంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ సబ్రీనా సిద్ధిఖీ ప్రశ్నించి నందుకుగాను ఆమెను సంఘ వ్యతిరేక శక్తులు ట్రోల్‌ చేయడాన్ని ఐఎఫ్‌ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పి.ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఖండించారు. సబ్రీనా సిద్ధిఖీ భారతదేశంలో స్వేచ్ఛ, మానవహక్కుల గురించి ప్రధాని మోడీని ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పారని అన్నారు. మోడీకి లేని అభ్యంతరం మిగతా వారికి ఎందుకని ప్రశ్నించారు. మీడియా ఎప్పుడూ ప్రజల తరపునే పనిచేస్తుందని, వారికే ప్రాతినిథ్యం వహిస్తుందని గుర్తు చేశారు.