నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పిహెచ్ సి) సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు దుగ్గి చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, పి హెచ్ సి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, సీజనల్ వ్యాధుల కాలం కాబట్టి రోజురోజుకు రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 7 గ్రామపంచాయతీలతో కలుపుకొని మొత్తం 11 గ్రామాలు ఉన్నాయన్నారు. ఈ 11 గ్రామాల రోగాల బారిన పడిన ప్రజలే కాకుండా, సరిహద్దు భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల, ఆల్లపల్లి మండలాల నుంచి కూడా, మర్కోడు, గొల్లగూడెం, అనంతరం కొత్తూరు, దామరతోగు గ్రామాల రోగులు, సరిహద్దు మంగపేట మండలం లోని కొత్తూరు మోట్లగూడెం గ్రామాల ప్రజలు వైద్యానికి వస్తున్నారని, బెడ్లు సరిపోవడం లేదని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటలు సర్వీస్ ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేయాలన్నారు. దానికి సరిపడా బెడ్లు (మంచాలు), వైద్య సిబ్బందిని పెంచాలన్నారు. వ్యాధిగ్రస్తులకు త్రాగడానికి నీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, కనీసం పేషెంట్లను చూసిన అనంతరం చేతులు కడుక్కోవడానికి వైద్యులకు, వైద్య సిబ్బంది కూడా నీరు కరువైందని అన్నారు. గతంలో వేసిన బోరు మొత్తం కూలిపోయింది అన్నారు. అలాగే హాస్పటల్ కు “టీకా మందులు” చల్లని ప్రదేశంలో ఉంచడానికి ఐ ఎల్ ఆర్ డి ఫ్రిడ్జ్ కావాలని, హాస్పటల్ కు కాంపౌండ్ వాల్, విద్యుత్ సమస్య కూడా ఉందని దీన్ని సంబంధిత అధికారులు పరిశీలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.