– సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ రైతు సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ రైతు సంఘం సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపింది. రైతుల సమస్యలపై కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని ఆ సంఘం నేతలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములతో కూడిన బృందం సీఎంకు వినతిపత్రం సమర్పించింది.
వినతిపత్రంలోని ముఖ్యాంశాలివే….
– భూమాతగా ప్రకటించిన ధరణిలో 20 లోపాలున్నట్టు గత బీఆర్‌ఎస్ క్యాబినెట్ కమిటీ అంగీకరించింది. వాటిని సరిచేయడానికి మీసేవ ద్వారా ప్రతి రైతు రూ.1650 చెల్లించారు. మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల మంది డబ్బులు చెల్లించి ధరఖాస్తులు పెట్టుకున్నారు. భూసమస్యల్లో నెలకొన్న లోపాలను సవరించి అందరికి పాస్‌పుస్తకాలు ఇవ్వాలి. సమగ్ర భూసర్వే నిర్వహించాలి.
– రెవెన్యూ రికార్డులలో కౌలు రైతుల పేర్లు, వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయుటకు రెవెన్యూ రిజిస్టర్‌లో ‘కాలం’ను ఏర్పాటు చేయాలి. వారి పేర్లు నమోదు చేయాలి. 2011 కౌలు చట్టాన్ని అమలు చేయాలి.
– గత రాష్ట్ర ప్రభుత్వం ‘కేంద్ర పీఎం ఫసల్ బీమా’ నుంచి వైదొలిగింది. అప్పటినుంచి రాష్ట్ర రైతులకు ఎలాంటి పరిహారం రావడం లేదు. రాష్ట్రంలో ఏటా రూ.5వేల కోట్ల విలువగల పంటలు దెబ్బతింటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రూపొందించాలి. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి నష్టపోయిన పంటలకు పరిహారం అందేలా చూడాలి.
– ప్రాధాన్యతాక్రమంలో సాగునీటి పథకాలను పూర్తి చేయాలి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులను రానున్న ఏడాదిలో పూర్తి చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలి. కాళేశ్వరం సహా భారీ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ‘హైకోర్టు జడ్జి’ ద్వారా విచారణ జరిపించాలి. సబ్సిడీపై మైక్రోఇరిగేషన్ (డ్రిప్, స్పింక్లర్) పథకాలు అమలు చేయాలి. ఐడీసీ నిర్వహణలోని లిఫ్ట్ పథకాలను రిపేర్లు చేయాలి.
– గతంలో విడుదల చేసిన 69 జీవో ప్రకారం నారాయణపేట, కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి పూర్తి చేయాలి.
– రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా కల్తీ విత్తనాల వ్యాపారం సాగుతున్నది. ఏటా 4, 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. కల్తీ విత్తనాలను పట్టుకోవడమే తప్ప నేరస్తులపై ఎలాంటి శిక్షలు లేవు. నష్టపోయిన రైతులకు పరిహారాలు లేవు. ‘రాష్ట్ర విత్తన చట్టా’న్ని రూపొందించాలి. కల్తీ విత్తన సంస్థల కంపెనీలను రద్దు చేయాలి.
– గత రెండేండ్లుగా వ్యవసాయ శాఖ ‘యాక్షన్ ప్లాన్’ ప్రకటన లేదు. వెంటనే వార్షిక ప్రణాళికలు ప్రకటించాలి. ఆయా ప్రాంతాల భూసారాన్ని బట్టి, రాష్ట్ర అవసరాలను బట్టి పంటల విధానాన్ని రూపొందించాలి.
– మ్యానిఫెస్టోలో ప్రకటించిన రైతు బరోసా పథకం ప్రకారం ఎకరాకు రూ.15,000 చొప్పున రైతుల ఖాతాలో వేయాలి. వానాకాలం పంటలకు సంబందించి ఎకరాకు రూ.7,500 చొప్పున వాస్తవ సాగుదారులందరికి వారి ఖాతాలలో జమ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలు, బోనస్ అమలు చేయాలి. లీటర్ పాలకు రూ.5 బోనస్ అమలుకు నిధులు విడుదల చేయాలి. రూ.2 లక్షల లోపు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలి. ఆర్‌బీఐ ప్రకారం 18 శాతం ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలి. అటవీ హక్కుల చట్టం2006 ప్రకారం అర్హులకు హక్కు పత్రాలు ఇవ్వాలి. మూసివేసిన చెరుకు ప్యాక్టరీలను తెరిపించుటకు చర్యలు ప్రారంబించాలి.