ప్రభుత్వ హాస్పిటల్‌ సమస్యలు పరిష్కరించండి

– క్యాజువాలిటీలో డాక్టర్‌ సేవలు మెరుగుపరచాలి
– డాక్టర్‌ పోస్ట్‌లు భర్తీ చేయాలి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కి సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-ఖమ్మం
మూడు రాష్ట్రాల నుంచి ప్రతి రోజూ వేలాది మంది పేషెంట్లు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిని నమ్ముకొని ఎంతో ఆశలతో వస్తున్నారని, వారికి ధైర్యం ఇచ్చే విధంగా వైద్య సేవలు ఉండాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు. శనివారం ఖమ్మంలోని సీపీఐ(ఎం) ఖమ్మం టూ టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ కిరణ్‌ తో భేటీ అయి పలు సమస్యలను ప్రతినిధి బృందం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌ మాట్లాడుతూ అనేక ప్రధానమైన హెల్త్‌ విభాగాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయని ప్రధానంగా 50 డాక్టర్‌ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వాటిని భర్తీ చేసి రోగులకు వైద్య సేవలు పెంచాలని కోరారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రి క్యాజువాలిటీలో సీనియర్‌ వైద్య సేవలు అవసరం ఉందని, కానీ సీనియర్‌ డాక్టర్‌లు కొద్ది టైం మాత్రమే ఉండి ప్రయివేటు క్లీనిక్‌ లుకు వెళ్ళుతున్నారని తెలిపారు. వివిధ శాఖల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లు, సిస్టర్‌ జాబ్‌లు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా లక్షలు రూపాయలు విలువ గల గుండె ఆపరేషన్‌ సేవలకు పర్మనెంట్‌ హార్ట్‌ డాక్టర్‌ను నియమించాలని కోరారు. అలాగే 3 నెలలుగా పెండింగ్‌ లో ఉన్న కాంట్రాక్టర్‌ వర్కర్స్‌ కు జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఆసుపత్రిలో రోగులకు మెరుగైన ఉచిత సేవలు కోసం రాబోయే కాలంలో సమస్యల పరిష్కారం కోసం దశలు వారిగా ఆందోళనలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం సూపరింటెండెంట్‌ కిరణ్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, నాయకులు జె.వెంకన్న బాబు, సిహెచ్‌.బద్రం, నాగేశ్వరరావు, పి.వాసు, మల్లికార్జున్‌ రెడ్డి, బి.ఎం. కష్ణ తదితరులు పాల్గొన్నారు.