– మంత్రి సీతక్కకు వ్యవసాయ కార్మిక సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారనీ, వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి శనివారం వినతి పత్రం అందజేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కూలీలకు మంచినీళ్ళు అందించే బాధ్యత పంచాయితీలకు అప్పగించటం అభినందనీయమని తెలిపారు. ఉపాధి హామీకి కేంద్రం తన బడ్జెట్లో కోత పెడుతున్నదని తెలిపారు. పని ప్రదేశంలో ఆన్లైన్ హాజరు, రెండు సార్లు ఫోటో క్యాప్చర్, ఆధార్ ప్రాతిపదికన కూలి డబ్బులు చెల్లించటమనే చర్యలు అన్యాయమని పేర్కొన్నారు. సకాలంలో కూలి డబ్బులు రావటం లేదనీ,అవి పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. కొత్త జాబు కార్డులు ఇవ్వకపోగా, ఉన్నవాటిని తొలగిస్తున్నారని వివరించారు. భూమిలేని ఉపాధి హామీ, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిందనీ, దాని అమలుకు ముందు కార్డులు లేని వ్యవసాయ కూలీలందరికీ కొత్త జాబుకార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉపాధి హామీ చట్ట స్ఫూర్తికి భంగం కలిగిస్తున్నాయని వివరించారు. చట్టం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలని విజ్ఞప్తి చేశారు.