– సీఎం సహా పలువురికి మెజారిటీ సంఘాల జేఏసీ వినతిపత్రాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మెజారిటీ ఆర్టీసీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జేఏసీ చైర్మెన్ అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రి కార్యాలయాలు, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. డిసెంబర్ మొదటివారంలోపు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ సహా ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో డిసెంబర్ 9 తర్వాత ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మర్రి నరేందర్, కో కన్వీనర్లు కులకర్ణి, పున్న హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.