మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించండి

మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించండి– ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌
– మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-షాద్‌నగర్‌
మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలనీ, అధికారులు ప్రజా ప్రతినిధులు సమస్యలపై దృష్టి సాధించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ చీమ వెంకన్న ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మెన్‌ కె. నరేందర్‌ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని, పట్టణంలోని అన్ని వార్డులలో ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలు జరిగేటట్టుగా చూడాలని సభ్యులు తెలిపారు. పురపాలక సంఘంలో చాలా ప్రదేశాలలో విద్యుత్‌ దీపాల సమస్యలు ఉన్నాయనీ, పాడైపోయిన వీధిలైట్లను వెంటనే మరమ్మతు చేయించాలని కోరడం జరిగిందన్నారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసమై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేసి అన్ని వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరడం జరిగింది. మిషన్‌ భగీరథ నీటి వలన చాలా చోట్లలో సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సభ్యులు కోరడం జరిగింది. పురపాలక సంఘంలోని చాలా ప్రాంతాలలో హైమాస్‌ లైట్లు వెలగడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పారిశుధ్య కార్మికుల ఉద్యోగానికి భద్రత కల్పించాలని వారికి ఆరోగ్య భీమా కల్పించాలని, పట్టణంలోని అన్ని వార్డులలో కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని సభలోని అందరి సభ్యులు అభిప్రాయపడ్డారు. వీటి నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలని, పురపాలక సంఘంలో విలీనమైన పరిసర గ్రామాలపై ప్రత్యేక దృష్టిని సహకరించి వాటి అభివృద్ధిపై ప్రత్యేక నిధులను కేటాయించాలని సభ్యులు సమదృష్టికి తెచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ నటరాజన్‌, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.