– సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, ఆ సంఘం నాయకులతో చర్చలు జరపాలని కోరారు. కేజీబీవీ, సీఆర్టీలకు, సమగ్రశిక్ష ఉద్యోగులకు, గురుకుల సీఆర్టీలకు, సింగరేణిలో పనిచేసే సీఆర్టీలకు మినిమం టైం స్కేలు వర్తింపజేయాలని సూచించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటుగా 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట మహమ్మారిగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను అమలు చేసి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని తెలిపారు. 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి న్యాయం చేయాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల సమయాన్ని తొమ్మిది గంటలకు మార్చాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖలో కూడా పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. ఈ అంశాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.