– మంత్రి పొంగులేటిని కలిసిన ఫెడరేషన్ నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కోరారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించకుండా పదేండ్లు జాప్యం చేసిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. శనివారం ఫెడరేషన్ ప్రతినిధుల బృందం రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, తన్నీరు శ్రీనివాస్, కార్యదర్శి ఈ. చంద్రశేఖర్, నాయకులు కె. పాండురంగారావు, జే. ఉదయభాస్కర్ రెడ్డి, యర్రమిల్లి రామారావు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. గతంలో జర్నలిస్టులకు మూడుసార్లు ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఒకేసారి రూ.100 కోట్లు విడుదల చేయాలని, చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి ఇచ్చే సహాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిలో హెల్త్ కార్డులు జారీ చేసి, అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవి చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎన్‌ఐ గుర్తింపు పొందిన అన్ని చిన్న, మధ్య తరహా పత్రికలను, కేబుల్ టీవీ న్యూస్ చానల్స్, డిజిటల్ మీడియాలను ప్రభుత్వం గుర్తించి, ప్రకటనలు, రాయితీల ద్వారా ఆదుకోవాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, సరైన వేతనాల చెల్లింపుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపులు జరిగాయనీ, అలాంటివి జరక్కుండా నిరోధిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ, రైల్వే రాయితీ పాస్‌ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలనీ, వారి పిల్లలకు ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్య వసతి కల్పించాలని చెప్పారు. వీటిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందనీ, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను మేనిఫెస్టోలో చేర్చి అమలు చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు