ఏమైందిరా రాజన్న మస్తుగ తయారైనవేందిరా.. కొత్త పైంటూ, కొత్త అంగీ దసరా బుల్లోని లెక్క మెరుత్తాన్నవూ..మళ్లేవన్న కొత్త దుకాణం బెట్టినవారా. సరెగని.. ఇంట్ల రోజు గా పోరగాల్లతోని ఎందుకురా లొల్లి. సదువూ సదువూ అని కొడుతే సదువుతరారా… సదువకోవాలే, పేరు దెచ్చుకోవాలే అని ఆళ్లకు మనసువడితట్టు జెయ్యాలే. గా చింతకింది ఎంకన్న కొడుకు సదివి నౌకరి దెచ్చుకున్నడు, గా కట్టకింది పోషాలు బిడ్డకు పట్నంల పెద్ద నౌకరైందని ఎంత మొత్తుకుంటె అళ్లకేందిరా. ఆళ్లు జేశేది అళ్లు జేత్తరు. ఈడుకచ్చిన పోరగాండ్లను శెవుల జోరీగ లెక్క మొత్తుకుంటే ఏం సదువు మనుసుల వడుతదిరా. నీ తిక్క నీకే దప్ప ఎవని మాట ఇనవైతివి. నేను వట్టిన కుందేలుకు మూడే కాళ్లంటవు. అన్ని నీ అయ్య బుద్దులే అచ్చినై నీకు. ముందుగాళ్ల మీ పెండ్లాం, మొగళ్లు టీవీ జూసుడు బంజెయ్యిర్రి. పొద్దుందాక వార్తలు, వంకాయలని టీవికి అతుక్కుంటవ్, పొద్దుగూకితే కోడలు పోరీ సీరియళ్లు, తొక్క తొండెం అని టీవీ ముందటికెళ్లి లేవది. పోరగాండ్లకు ఇంకెక్కడ సదువు మనుసుల వడ్తదిరా. కొన్ని గావాలంటే, కొన్ని మానేయాలే. అయినా నీకు నేను జెప్పటోన్నారా. నీకెట్ల దోత్తె అట్ల జెయ్యి.
-ఊరగొండ మల్లేశం