– యుఎస్‌లో సరిపడ బియ్యం నిల్వలున్నాయి
– డెక్కన్ గ్రెయింజ్ ఇండియా డైరెక్టర్ కిరణ్ కుమార్
హైదరాబాద్ : అమెరికాలో వచ్చే ఆరు నెలలకు సరిపడ బియ్యం నిల్వలు ఉన్నాయని హైదరాబాద్ కంపెనీ డెక్కన్ గ్రెయింజ్ ఇండియా డైరెక్టర్ కిరణ్ కుమార్ పోల తెలిపారు. ప్రస్తుతం సుమారు 12,000 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని.. అలాగే భారత్ నుంచి 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం రవాణాలో ఉందని ఎగుమతిదార్లు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. అక్కడి భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం ఎగుమతిదార్లకు ఉందని కిరణ్ కుమార్ తెలిపారు. ”కొరత భయంతో బియ్యం కోసం అధికంగా వెచ్చించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగదు. అమెరికాలోని భారతీయులు సోనామసూరి బియ్యం అధికంగా వాడతారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నిషేధం నుంచి సోనామసూరి బియ్యంను మినహాయించాలి.” అని కిరణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత్ నుంచి నెలకు సగటున బాస్మతీయేతర బియ్యం 6,000 మెట్రిక్ టన్నులు యుఎస్‌ఎకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా 4,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని సమాచారం.