‘జైత్రయాత్ర’ సాగించిన పాట

'జైత్రయాత్ర' సాగించిన పాటచుట్టూ చీకటి అలుముకున్నప్పుడు చిన్న దీపాన్ని వెలిగించాలి. వెలుగును ప్రసరింపజేయాలి. ఒక్కోసారి – ఆ దీపం వెలిగించాలనే ఆలోచనాజ్ఞానం కూడా జనానికి లేకపోవచ్చు.  అలాంటప్పుడు దీపాన్ని వెలిగించే చేయి కావాలి. వెలుగు వైపు నడిపించే మనిషి తోడు కావాలి. అలుముకున్న చీకటితో పాటు ముసురుకున్న అజ్ఞానాన్ని తొలగించి, విజ్ఞానాన్ని,  వెలుగుని, సత్తువని మనలో నింపే నాయకుడు కావాలి. అతడిచ్చే గొప్ప సందేశం కావాలి. ఆ సందేశమే అభ్యుదయకవి అదృష్టదీపక్‌ రాసిన ఈ పాట.. ఆ పాటనిపుడు చూద్దాం.

అభ్యుదయ సినీకవి అదృష్టదీపక్‌ ఏది రాసినా సముద్రమంత గంభీరంగా ఉంటుంది. ఆకాశమంత ఎత్తుగా ఉంటుంది. విశ్వమంత విశాలంగా ఉంటుంది. మహాకవి శ్రీశ్రీలోని అభ్యుదయభావచ్ఛాయలు అదృష్టదీపక్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. అందుకు ఈ పాటే సాక్ష్యం. ఆయన కలమెత్తి, గళమెత్తి వినిపించిన పాట ఇది. ఆయన ఈ పాటలో – నిరాశలో, చీకటిలో కుమిలిపోయి బతుకుతున్న ప్రజలకు హితబోధ చేశాడు. బానిసత్వాన్ని, అరాచకత్వాన్ని ఎదిరించమని, ఓడించమని చెప్పాడు. దేనికైనా సరే తెగించి ముందుకు దూకమన్నాడు.
1991 లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘జైత్రయాత్ర’ సినిమాలోని పాట ఇది. సినిమాకథపరంగా చూస్తే – ఒక ఊరిలో.. కొంతమంది అవినీతిపరులు అధికారాన్ని చేజిక్కించుకుని రాజ్యమేలుతుంటారు. అమాయకులైన ప్రజలు వాళ్ళ చేతిలో చిక్కుకుంటారు. అవినీతిపరుల మాటలు విని నిరక్షరాస్యులైన ప్రజలంతా దొంగతనాలు చేసుకొచ్చి వచ్చిన డబ్బంతా వాళ్ళకిస్తారు. వాళ్ళు పోసిన గంజినీళ్ళు తాగి కాలం వెళ్ళదీస్తారు. చదువంటే ఏమిటో తెలియని వాళ్ళ ఊరికి హీరో విజ్ఞానిలా వస్తాడు. హీరో ఆ ఊరికే రావడానికి కారణం.. హీరో కూడా బాల్యంలో ఆ ఊరి అవినీతిపరుల చేతుల్లో బాధలు పడడమే. బాల్యంలోనే ఆ ఊరినుంచి వెళ్ళిపోయి, ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి వస్తాడు. చిమ్మ చీకటిలో మగ్గిపోయి బతుకుతున్న ప్రజల్ని, అజ్ఞానంతో తప్పుడు తోవలో నడుస్తున్న ఆ జనాన్ని వెలుగువైపు నడిపించాలనుకుంటాడు. వాళ్ళను ఉత్తేజపరచడానికి ఈ పాటను పాడతాడు. ఇదీ..ఈ పాట నేపథ్యం.
శోకాలతో అలుముకున్న ఈ చీకటి ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్ని రోజులు? ఇకనైనా మన బతుకుల్లోకి ఉదయం రావాలి. ఈ బాధలు తీరిపోవాలి. చిట్టెమ్మా, చిన్నమ్మా, చిన్నారి, పొన్నారి, చిన్నా, పెద్దా..అంతా నా మాట వినండి. నా పాట వినండి. అడుగు ముందుకు వేయండి. మీకు తెలియకుండా మిమ్మల్ని చుట్టుముట్టిన ఈ చీకటిని తుడిచిపెట్టండని చెబుతాడు.
చీకటి మనల్ని ఆవరించుకున్నా ఆ విషయం మనకు తెలియదు. దానికి రెండు కారణాలున్నాయి. 1) మనం అజ్ఞానులమై ఉండడం. అంటే.. నిరక్షరాస్యులమై ఉండడం. 2) భయపడుతూ ఉండడం.
నిజానికి ఈ భయం కూడా అజ్ఞానులవ్వడం వల్లనే అన్న విషయం కూడా ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు.
పలకా బలపం పట్టి బడిలో అక్షరాలు నేర్వవలసిన సమయమిది. అల్లరి, చిల్లరగా తిరిగి, చదివే వయసును వృధా చేయవలసిన సమయం కాదిది అని చెబుతున్నాడు. మీకు చదువే లోకం, గురువే దైవం.. ఈ సందేశాన్ని గ్రహించండి. ఎదుగుతున్న వయసులో న్యాయం కూడా నేరం. ఎందుకంటే అన్యాయం రాజ్యమేలుతున్న కాలమిది. అలా అని న్యాయాన్ని విస్మరించవద్దు. జాగ్రత్తగా న్యాయం వైపు అడుగేస్తూ న్యాయాన్ని గెలిపించాలి. కలలే నెరవేరకపోతే, అవే కన్నీళ్ళై మిగిలిపోతే బతుకే భారమవుతుంది. చివరికి జీవితమే శూన్యమవుతుంది.
కష్టాలకి, సవాళ్ళకి ఎదురొడ్డి కలలు నిజం చేసుకోవాలన్న విషయాన్ని పసివాళ్ళకు తెలియజేస్తాడు. తొలిఅడుగు వేసే ఆ విద్యార్థులకు కాలం గుట్టు, లోకం నాడి వివరిస్తాడు. అవినీతి, అధికారం పంజా విసిరిన ఈ లోకంలో మనం నేర్చుకున్న అర్థాలన్నీ మారిపోయాయి. మనం కట్టుకున్న కలలకోటలు కూలిపోయాయి. కన్నీరు కార్చే పేదలకళ్ళు, అసూయతో, కుళ్ళుతో ఉన్న లోకాలు మనల్ని నేడు చుట్టుముట్టి ఉన్నాయి. చేతులు కలపండి. సైనికులై లెండి. అంటూ ఉవ్వెత్తున గర్జిస్తున్నాడు. మామూలుగా చదువుకోవడం, మనల్ని మనం వెలిగించుకోవడం కాదు. చుట్టూ ఉన్న అవినీతిని మట్టుపెడుతూ, విజ్ఞానాన్ని పంచుతూ మనం చదువుకోవాలి. వెలిగిపోవాలని చెబుతుంటాడు హీరో.
కదిలే కాలంతో పాటు మన ప్రయాణం ఆగకుండా సాగాలి. మన ధ్యేయం నెరవేరేందుకు యుద్ధం చేయాలి. గాయాలుగా రగిలిపోయి ప్రాణం నలిగిపోతోంది. గేయాలుగా పగిలిపోతూ గానం మిగిలిపోతోంది. ఈ కష్టాలన్నీ గట్టెక్కించాలి. అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించాలి. కన్నవారి కన్నుల్లో కన్నీళ్ళు కాదు. వెన్నెల కురవాలి. ఇన్నాళ్ళ చీకట్లకు చెల్లు రాయించి వెలుతురును తీసుకురావాలి. కష్టాలు లేని, కన్నీళ్ళు రాని పూలదారుల్లోకి మనం సాగిపోవాలి. నేర్పుగా నడవండి. మన జీవితాల్లో మార్పును కోరండి. మార్పును తీసుకురండి. సమసమాజ ప్రగతి కోసం అందరూ చేయి చేయి కలిపి నడవండి. నేటి చీకటి మరిచి రేపటి ఉషోదయం కోసం కలలు కనండి. ముందుకు సాగండని సందేశాన్నిస్తాడు హీరో. ఆ తర్వాత నిరుపేదల కన్నీళ్ళు రగిలితే ఎలా ఉంటుందో అవినీతి ప్రభుత్వానికి చూపిస్తారు వాళ్ళు. అజ్ఞానం ముసుగు తొలగి, విజ్ఞానం మెదడులో మొలకెత్తితే ఎలా ఉంటుందో చూపిస్తారు వాళ్ళు. ప్రజలను ప్రగతి వైపు నడిపించిన పాట ఇది. జైత్రయాత్ర సాగించిన పాట ఇది.
ఈ పాటలో అదృష్టదీపక్‌ వాడిన పదబంధాలు అద్భుతం.. రగిలే గాయం, పగిలే గేయం, పొగిలే ప్రాణం, మిగిలే గానం, కదిలే కాలం, ఎదలో ధ్యేయం.. వంటివన్నీ అభ్యుదయకవితా దృక్పథాన్ని చాటుతున్నాయి.
పాట:

ఎన్నాళ్ళమ్మా? ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటీ?/
వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా/
ఓ చిట్టెమ్మా చిన్నమ్మా చిలకమ్మా సీతమ్మా నా మాట వింటారా?/
ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా?/
బడిలో మీకిక చదువే లోకం/ బలపం పట్టే వేళ గురువే దైవం/
పెరిగే ఈడున న్యాయం నేరం/ కలలే కన్నీళ్ళైతే బతుకే భారం/
నేర్చిన అర్థాలన్ని మారిపోయేను/ పేర్చిన స్వప్నాలన్ని కూలిపోయేను/
ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టు ముట్టేను/
చేతులు కలపండిరా! సైనికులై లెండిరా!/
కదిలే కాలమై గమనం సాగి ఎదలో ధ్యేయం కోసం సమరం రేగి/
రగిలే గాయమై పొగిలే ప్రాణం/
పగిలే గేయం తానై మిగిలే గానం/
కన్నోళ్ళ కన్నుల్లోన వెన్నెలే పంచి/
ఇన్నాళ్ళ చీకట్లకు చెల్లు రాయించి/
కష్టాలు లేనట్టి కన్నీళ్ళు రానట్టి/
పూలదారుల్లోకి సాగిపోదాము/
నేర్పుగ నడవండిరా మార్పును కోరండిరా!
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com