జైపూర్ : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. అలాగే ఇదే రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులు చున్నీలాల్ గరసియా, మదన్ రాథోర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలిపారు. రాజసభ్య ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడవు మంగళవారంతో ముగిసింది. దీంతో ఈ ఫలితాలను అధికారులు వెల్లడించారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్), భూపేంద్ర యాదవ్ (బీజేపీ) పదవీ కాలం ఏప్రిల్ 3తో ముగియనుంది. అలాగే డిసెంబరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో కిరోడి లాల్ మీనా (బీజేపీ) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజస్థాన్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుత ఫలితాలతో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.