త్వరలో ఇంటింటికి అయోధ్య పూజిత అక్షింతలు

– జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్టలో ఇంటింటికి అయోధ్య పూజిత అక్షింతలు త్వరలో అందనున్నాయి. అయోధ్య పూజిత అక్షింతలు చేరుకున్న సందర్భంగా సోమవారం, భక్తులు అక్షింతల కలశానికి ఘనంగా శోభయాత్ర ర్యాలీగా స్వాగతం పలికారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని, టెంకాయ కొట్టి, జండా ఊపి ప్రారంభించారు. అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రతి కుటుంబానికి ప్రసాదంగా పూజిత అక్షింతలు అందజేయాలని నిర్ణయించారు. జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. ఈలోగా భారత దేశంలోని ప్రతి కుటుంబానికి ఈ అయోధ్య పూజిత అక్షింతలు అందజేయాలని టెస్ట్ వారు నిర్ణయించారు. దీంట్లో భాగంగా గత నెల విమాన మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పూజిత అక్షింతలు చేరుకున్నాయి. డిసెంబర్ ఆరవ తేదీన మన జిల్లాకు చేరాయి.  జనవరి 1 నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి కార్యకర్తల బృందం తిరిగి అక్షింతలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో భరత్ గౌడ్, కౌన్సిలర్ మల్లేష్, ఎరుకల హేమేంధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.