– మీ ఇంట్లో ఎవరైనా దూరితే అంగీకరిస్తారా
– ఆడియోలో నటుడు మోహన్ బాబు
– జర్నలిస్టుపై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ బడంగ్‌పేట్
జర్నలిస్టును కొట్టిన మాట నిజమే.. కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని, అయినప్పటికీ అలా కొట్టినందుకు చింతిస్తున్నానని సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన 11 నిమిషాల ఆడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ”జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదు. ఫ్యామిలీ విషయాల్లో ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా..? ఈ విషయాన్ని గురించి ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలి. నా ఇంట్లోకి దూసుకొచ్చే వారు మీడియా వారా? ఇంకా వేరే ఎవరైనానా అనే విషయం నాకు తెలియదు. మీడియాను అడ్డు పెట్టుకుని నాపై దాడి చేయాలని ఎవరైనా అనుకోవచ్చు. చీకట్లో జరిగిన ఘర్షణ కావడంతో నేను కొట్టిన దెబ్బ అతడికి తగిలింది. ఆ మీడియా ప్రతినిధి తనకు తమ్ముడిలాంటి వాడు. అతని కుటుంబ సభ్యుల గురించి నేను చాలా ఆలోచించాను. కానీ నా బాధ గురించి ఎవరూ ఆలోచించలేదు. నేను సినిమాల్లో నటిస్తాను తప్ప నిజ జీవతంలో నటించను. ఎప్పుడూ నీతిగా, ధర్మంగా, నిజాయితీగా బతకాలి అన్నదే నా ఆలోచన. గేటు బయట నేను మీడియా వారిపై అసభ్యంగా ప్రవర్తించి ఉంటే, కొట్టి ఉంటే కచ్చితంగా నాపై 50 లేదా 100 కేసులు పెట్టుకోవచ్చు. లేకపోతే నేనే వెళ్లి పోలీసులకు లొంగిపోయేవాడిని. కానీ జర్నలిస్టులు నా కాంపౌండ్‌లోకి వచ్చి నా ప్రశాంతతను చెడగొట్టారు. మేము ప్రస్తుతం ఉన్న విషయాల గురించి కుర్చుని మాట్లాడుకుంటాం. ఏదో ఒక రోజు మా మధ్య ఉన్న విభేదాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకంగా ఉన్నాను. జర్నలిస్ట్‌ను కొట్టడం తప్పే అయినా నేను ఆ పని ఏ పరిస్థితుల్లో చేశానో కాస్త అర్థం చేసుకోండి. మీడియా ప్రతినిధిని కొట్టినందుకు చింతిస్తున్నాను. నేను కొట్టింది వాస్తవమే, అప్పుడున్న పరిస్థితుల గురించి అంతా ఆలోచించాలి.మీ ఇంట్లో ఎవరైనా దూరితే… మీ ఏకాగ్రతను భగం చేస్తే అంగీకరిస్తారా? న్యాయాధిపతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు దీనిపై ఆలోచించాలి. మీకు టీవీలు ఉన్నాయి.. మాకు టీవీలు (చానళ్లు) లేవు.. రేపు నేను కూడా టీవీ పెట్టొచ్చు.. అది కాదు గొప్ప.. కానీ మీడియా ప్రతినిధి మనసును గాయపర్చినందుకు చింతిస్తున్నాను. పోలీసులు అంటే నాకు ఇష్టం. మా విశ్వవిద్యాలయం నుంచి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. వారికి మా విద్యాసంస్థల నుంచి న్యాయం, ధర్మం నేర్పించాను. మా విద్యాసంస్థల నుంచి వెళ్లి ఉద్యోగం చేస్తున్న వారు న్యాయంగా ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? ప్రజలే ఆలోచించాలి. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. కానీ అన్నీ మరిచిపోయి నేను కొట్టిన విషయమే మాట్లాడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనపై తొలుత బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదైంది. తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.