మిగిలిపోయిన కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించండి

సీఎం కేసీఆర్‌కు 475 అసోసియేషన్‌ లేఖ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను క్రమబద్ధీకరించినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకుకు 475 అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ ధన్యవాదాలు తెలిపారు. అయితే మిగిలిపోయిన కాంట్రాక్టు అధ్యాపకులనూ క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ మేరకు సీఎంకు వారు ఆన్‌లైన్‌ ద్వారా శనివారం లేఖ రాశారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో తెలంగాణ ఆదర్శంగా ఉందని తెలిపారు. మరి కొంతమంది కాంట్రాక్టు అధ్యాపకులు గత 23 ఏండ్లుగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారి విషయంలో కొంతమందికి సాంక్షన్‌ పోస్టులు, తగిన విద్యార్హతలు, అదనపు అర్హతలు లేవంటూ చిన్న చిన్న కారణాలు చూపుతూ క్రమబద్ధీకరణ చేపట్టలేదని వివరించారు. వీటికి కాంట్రాక్టు అధ్యాపకులు బాధ్యులు కాదని, సంబంధిత అధికారులు సమయానుకూలంగా తగిన ఉత్తర్వుల్లో మార్పులు చేయకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. వారి క్రమబద్దీకరణ విషయంలో తగిన మినహాయింపునిచ్చి క్రమబద్ధీకరణ చేపట్టాలని కోరారు. ఈ అంశాలను మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు వాటిపై ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో క్రమబద్ధీకరణ కాని కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని మినహాయింపులిచ్చి క్రమబద్ధీకరణ అయ్యేలా చూడాలని కోరారు.