ఆత్మ వేదన

soul anguishకలుక్కుమన్న శబ్దం – ఎవరో జివ్వున లాగేసినట్టు …
వేదనలు, రోదనలు – ఏవేవో రణగొణ ధ్వనులు …చూస్తే
సుమారు పన్నెండడుగుల ఎత్తులో పైన – శూన్యం లో
కిందకి చూసి ఉలిక్కిపడ్డా – నా శరీరం అచేతనంగా పడివుంది
రమ్మని దీనంగా పిలుస్తుంది – బిత్తరపోయా !
గాలిలో తేలియాడుతూనే – గట్టి ప్రయత్నం చేస్తున్నా కానీ
ఏదో శక్తి ఆపేస్తుంది ! తల్లడిల్లిపోయా, బిక్కు బిక్కుమని చూస్తున్నా
నల్లని ఆకాశం నవ్వు కసాయి నవ్వు కాదా ?
అమ్మ ఒడి నుండి బిడ్డని వేరు చేసినట్టు – నన్ను
నా శరీరం నుండి విడదీస్తారా – నేను, నా మాటలు
ఎవరికి కనించను, వినిపించవు – ఏం చేసేది ?
తుది యాత్ర కు ఏర్పాట్లు అంటూ ఏదేదో చేస్తున్నారు …
స్నానం పోస్తుంటే – సావు డప్పు బీభత్సం చేస్తుంది !
రథం మీద వెళ్తున్న నా ‘తనువు’ కోసం ఉద్వేగంతో
పరుగెడుతున్నా- కాష్టం చేరుకున్న, దింపుడు కళ్లెం చోట…
చెవిలో పిలుస్తున్నా – ఉలుకు, పలుకు లేదాయె
నన్ను పిలవమంటుంది కానీ నేనెలా… ?
వెదురు తో పేర్చిన తనువు పై మంటలు చెలరేగాయి…
”వెళ్లిపోతున్నా నేస్తమా నువ్వు పైలం”- అంటున్న వాఖ్యలు
మంటల్లో మారు మోగుతుంటే – అవే చివరివి అని తెలియక…
భగ భగ మంటల తాకిడికి తట్టుకోలేక – పొగతో
ఏమీ కానరాక, అగ్ని కీలల తాకిడికి మరింత పైకి చేరుకున్న – ఇంతలో
‘ధడేలు’ మని శబ్దం, తల పేలినట్టు అనిపించింది – వెక్కి వెక్కి ఏడుస్తున్నా!
అయినా ఆశ చావక – తదుపరి, మరుసటి, ఆ మరుసటి …దినాల్లో
తిరిగిన, ఇష్టమైన ప్రదేశాలన్నీ చూసుకున్నా- లాభం లేదని
దగ్దమైన చోటుకే తిరిగొచ్చా – చివరికి ద్వాదశ కర్మలంటూ చేసి పెట్టిన
పిండాలను – భోజనంతో పాటు గుంపుగా ఆరగిస్తున్న విహంగాలు (పిట్టలు)
సంతప్తి తో ”కావ్‌ కావ్‌” మని కేరింతలు కొడుతుంటే – ఏవీ శాశ్వతం
కాదని బోధపడి – కుదుట పడ్డ మనసుతో పయనమయ్యా
పర లోకాలకు – ఇక సెలవు మిత్రమా !!!
– న్యాలకంటి నారాయణ, 9550833490