సెమీస్‌కు దక్షిణాఫ్రికా

South Africa to the semis– న్యూజిలాండ్‌పై 190పరుగుల తేడాతో గెలుపు
– డికాక్‌, డుస్సెన్‌ సెంచరీలు
– మహరాజ్‌కు నాలుగు వికెట్లు
పుణె: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఏకంగా 190పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 357పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్‌ జట్టు 35.3ఓవర్లలో 167పరుగులకు కుప్పకూలింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టు 7మ్యాచుల్లో 12పాయింట్లతో సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
తొలుత దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(114; 116 బంతుల్లో 10ఫోర్లు, 3సిక్సర్లు) ఈ ప్రపంచకప్‌లో నాల్గో శతకానికి తోడు, వాండర్‌ డుస్సెన్‌(133; 118బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు) రెండో శతకాన్ని కొట్టాడు. చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ (53; 30బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ శతకం సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 357పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. ఓపెనర్‌ తెంబా బావుమా(24) త్వరగా పెవీలియన్‌కు చేరగా.. 2 వికెట్‌కు డుస్సెన్‌-డికాక్‌ 200పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో డికాక్‌ నెమ్మదిగా ఆడాడు. డికాక్‌-డుస్సెన్‌ తొలుత నిలకడగా ఆడినా.. ఆ తర్వాత బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో డికాక్‌ 103బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని సౌథీ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో డికాక్‌.. ఫిలిప్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే నీషమ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది డుస్సెన్‌ 101 బంతుల్లో శతకాన్ని కొట్టాడు. వ్యక్తిగత స్కోర్‌ 133పరుగుల వద్ద డుస్సెన్‌ను సౌథీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న మిల్లర్‌ దూకుడుగా ఆడాడు. నీషమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో సిక్స్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న మిల్లర్‌.. తర్వాతి బంతికే డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీకి రెండు, ట్రెంట్‌ బౌల్ట్‌, నీషమ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ కాన్వే(2) త్వరగా ఔటైనా.. యంగ్‌(33), మిఛెల్‌(24) ఫర్వాలేదనిపించారు. మిడిలార్డర్‌లో ఫిలిప్‌(60) అర్ధసెంచరీ మినహా మరో బ్యాటర్‌ రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. దీంతో న్యూజిలాండ్‌ జట్టు ఈ టోర్నమెంట్‌లో తొలిసారి స్వల్ప స్కోర్‌కే అలౌటైంది. మహరాజ్‌కు నాలుగు, జెన్సన్‌కు మూడు, కొర్ట్జేకు రెండు, రబడాకు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డుస్సెన్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: క్వింటన్‌ డికాక్‌ (సి)ఫిలిప్స్‌ (బి)సోథీ 114, బవుమా (సి)మిఛెల్‌ (బి)బౌల్ట్‌ 24, డుస్సెన్‌ (బి)సౌథీ 133, మిల్లర్‌ (సి)మిఛెల్‌ (బి)నీషమ్‌ 53, క్లాసెన్‌ (నాటౌట్‌) 15, మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 6, అదనం 12. (50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 357పరుగులు.
వికెట్ల పతనం: 1/38, 2/238, 3/316, 4/351
వికెట్ల పతనం: బౌల్ట్‌ 10-1-49-1, హెన్రీ 5.3-0-31-0, సోథీ 10-0-77-2, సాంట్నర్‌ 10-0-58-0, ఫిలిప్స్‌ 7-0-52-0, రవీంద్ర 2-0-17-0, నీషమ్‌ 5.3-0-69-1.
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి)మార్క్‌క్రమ్‌ (బి)జెన్సన్‌ 2, యంగ్‌ (సి)డికాక్‌ (బి)కొర్ట్జె 33, రవీంద్ర (సి)కొర్ట్జే (బి)జెన్సన్‌ 9, మిఛెల్‌ (సి)మిల్లర్‌ (బి)మహరాజ్‌ 24, లాథమ్‌ (సి)మహరాజ్‌ (బి)రబడా 4, ఫిలిప్స్‌ (సి)రబడా (బి)కొర్ట్జే 60, సాంట్నర్‌ (బి)మహరాజ్‌ 7, టిమ్‌ సోథీ (ఎల్‌బి)జెన్సన్‌ 7, నీషమ్‌ (బి)మహరాజ్‌ 0, బౌల్ట్‌ (సి)మిల్లర్‌ (బి)మహరాజ్‌ 9, హెన్రీ (నాటౌట్‌) 0, అదనం 12. (35.3ఓవర్లలో ఆలౌట్‌) 167పరుగులు.
వికెట్ల పతనం: 1/8, 2/45, 3/56, 4/67, 5/90, 6/100, 7/109, 8/110, 9/133, 10/167
బౌలింగ్‌: జెన్సన్‌ 8-1-31-3, ఎన్గిడి 6-1-28-0, రబడా 6-2-16-1, కొర్ట్జే 6.3-0-41-2, మహరాజ్‌ 9-0-46-4.