దక్షిణ భారత కాశ్మీర్‌

దక్షిణ భారత కాశ్మీర్‌అందాల అలప్పీ ప్రయాణం ఇప్పటికీ ఆహ్లాదంగా, అందంగా అనిపిస్తుంది పిల్లలతో మేమూ పిల్లలమయ్యాం. కేరళ అందాల సీమ ప్రకృతిని చూసి – మనం, మనల్ని చూసి ప్రకృతి ఆనందిస్తుందా అనిపిస్తుంది. కేరళ ప్రయాణం ఒక మరపురాని, మరవలేని మధుర జ్ఞాపకం.
కేరళ వెళ్లాలనే కోరిక ఎప్పుడూ నన్ను గుర్తుచేస్తూ ఉండేది. ఆ కోరిక ఈ ఏడాది తీరింది. ఎన్నో అనుభూతులను మిగిల్చి ఇచ్చింది.
మొదట మా ప్రయాణం మున్నార్‌లో ప్రారంభమయ్యింది. ‘మున్నార్‌’ను దక్షిణ భారతదేశ కాశ్మీర్‌ అంటారని తెలుసు. చూస్తే గానీ, ఎందుకు కాశ్మీర్‌ అంటారో తెలిసింది.
ఉదయం 9 గంటలకు మధురై నుండి ప్రయాణం ప్రారంభించాం. పచ్చని పచ్చిక బయళ్లు, రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి చెట్లతో ఆకుపచ్చని చీర పరుచుకున్నట్టుగా, పల్లెటూర్లు ప్రకృతితో మమేకమై ఉన్నాయి. తమిళనాడు బోర్డర్‌, కేరళ బోర్డర్‌ ఎక్కడ విభజించబడ్డాయో తెలిసేసరికి మేం మున్నార్‌కు చేరుకున్నాం, మధ్యాహ్నం 1 గంటకు.
ఒకవైపు కుందా లోయ, మరోవైపు ఎంతో ఎత్తైన శిఖరాలు… అవి సముద్ర మట్టానికి 1600 మీ నుండి 2600 మీ ఎత్తులో ఉంటాయని తెలిసింది. అక్టోబర్‌ నెలలో కూడా పచ్చని ప్రకృతిని చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ కొండలంతా టీ, కాఫీ తోటలు. మధ్యమధ్యలో రబ్బరు చెట్లు. పైకి వెళ్తున్న కొద్దీ ప్రకృతి రమణీయత ద్విగుణీకృతమవుతుంది.
పక్షుల కిలకిలలు, జతపాతాల సవ్వడులు అడుగడుగునా మిమ్మల్ని ముందుకు వెళ్లనివ్వకుండా కట్టిపడేశాయి. ఫొటో, వీడియో తీసినా కూడా వాటికి కూడా అంతుచిక్కడం లేదు. ఆ ఎత్తు కిందకు చూస్తే అంతలోతు, నిశ్చబ్ద తరంగాలను అక్కడ వదిలినట్టుంది. ఆకులు కదిలిన, గాలి వీచినా వినిపిస్తుంది సంగీతం లాగా.
మున్నార్‌ అంటే మూడు నదుల సంగమం. ముదిరపుళ, నల్లతన్ని, కుండలి అనే ఈ మూడు నదుల సంగమం అంట. ఇది ఇడుక్కి జిల్లాలో వుంది. ఐదువందల అడుగులు, అంతకన్నా ఎక్కువ ఎత్తు వుండవచ్చు. జలపాతం జన్మస్థానం ఇది. ఆ ఎత్తు నుండి ఒక బండరాయి నుండి ఇంకొక రాయి మీదికి దునికి, మళ్లీ పక్కరాయికి అలా అంతస్తుల్లాగా కదిలి నేలమీదికి పరుగులు పెడుతున్న దృశ్యాన్ని చూస్తే తనివి తీరదు. అక్కడ పెద్దవాళ్లందరూ పిల్లలయ్యారు. వాళ్ల కేరింతలు, పిల్లల అరుపులు జలపాతాల శబ్ద సరిగమలకు వినబడలేదు.
ఈ భూమ్మీద మానవుడు, ఎన్ని కృత్రిమంగా సృష్టించినా ప్రకృతిని మించి సృష్టించడం సాధ్యంకాదని ఈ దృశ్యాలను చూశాక అర్ధం అయ్యింది.
ఇంకా కొంచెం ముందుకు వెళ్లాం. ఆ కొండ శిఖరాలు, మేఘాలను తాకినట్టుగా అన్పించింది. ఒక్కసారిగా భయం మొదలయ్యింది. చుట్టూ ఏమీ కనిపించడం లేదు. తెల్లని మంచు దుప్పటిలాగా కప్పేసింది. కారు దిగాం. మాకు ఐదు నుండి పది అడుగుల్లో కొంచెం స్పష్టంగా కనిపిస్తుంది. ముందుకు వెళ్లకుండా పిల్లలూ, మేమూ ఫొటోలు, వీడియోలు తీసుకున్నాం భయం పోవాలని. కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్క కారూ నెమ్మదిగా, మనిషి నడుస్తున్న వేగంతో కదిలాయి. రెండు, మూడు కిలోమీటర్లు దాటాక మళ్లీ తేయాకు తోటలు, జలపాతం పున:స్వాగతం పలికాయి. ఎటువైపు చూడాలో అర్ధం కావడంలేదు. ప్రకృతి పరిమళం ప్రతి అడుగులో, ప్రతివైపూ కళ్లు తిప్పనీయకుండా కట్టిపడేస్తుంది.
సాయంత్రం నాలుగు గంటలకు గానీ, మున్నార్‌ పట్టణం చేరుకోలేదు. మధ్యలోనే మేం భోజనం చేశాం. దారిలో వున్న రెస్టారెంట్‌లో ఒకప్పుడు మున్నార్‌ గ్రామ పంచాయితీ అట. ఇప్పుడు పట్టణంగా వృద్ధి చెందింది. చూడడానికి చాలా పరిశుభ్రంగా వుంది. అడుగడుగునా పోలీసులు. ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు. చిన్న చిన్న వంతెనలు. ఇళ్లు మాత్రం చాలా ఇరుకుగా వున్నాయి. కొండ ప్రదేశం కావడం ఒక కారణం కావచ్చు. అక్కడ నన్ను ఒక ఏనుగు ఆకట్టుకుంది. 25 అడుగుల ఎత్తున్న ఏనుగు రూపంలో ఒక వలను ఏర్పాటు చేసి, అందులో వాడిపడేసిన వాటర్‌ బాటిళ్లను అమర్చారు. ఆ ఆలోచనతో అక్కడివారు, ప్రభుత్వం ప్రకృతిని ఏ విధంగా కాపాడుతున్నారో అర్ధమయ్యింది.
సాయంత్రం 5 గంటలకు అక్కడి విశ్రాంతి (గెస్ట్‌హౌస్‌) గదులను వెదకటం ప్రారంబిద్దాం అనుకుని బయలుదేరాం. పట్టణం మొదట్లోనే చాలామంది కారు ఆపి, అడుగుతున్నారు గెస్ట్‌ హౌస్‌ కావాలా అని. అవునని చెప్పి, వాళ్లతో బయలుదేరాం. అప్పటికే ఆ దారిలో మాకు హైదరాబాద్‌ నుండి వచ్చిన కుటుంబం వారు కలిశారు. మేం కూడా మీతో వస్తామని చెప్పారు. మున్నార్‌ పట్టణం రద్దీ, ఇరుకు రోడ్ల వల్ల మేం ఆ కొండల మధ్యలో గల ఇళ్లలో ఉండలేమని, అది సౌకర్యవంతంగా వుంటే వుందామని, లేకపోతే అలెప్పీ వెళ్దామని నిశ్చయించుకున్నాం.
వాళ్లు ఆరు నెలల క్రితం కట్టిన గెస్ట్‌ హౌస్‌కి తీసుకెళ్లి చూయించారు. అందులో మూడు ఇళ్లు వున్నాయి. రెండు ఇళ్లు ఒక అంతస్తుతో వున్నాయి. మేం కింది పోర్షన్‌ తీసుకున్నాం. వెనుకవైపు బాల్కనీ, పక్కనే తేయాకు తోట.. చాలా అందంగా వుంది. పిల్లలకు ఆడుకోడానికి జారుడుబండలు, పెద్దవాళ్లకు అందరికీ ఉయ్యాలలు, సూర్యోదయం కోసం ఆరుబయట చిన్న తోట… చూడగానే అందరికీ నచ్చింది.
లగేజీ తీసుకుని వెళ్లి స్నానాలు చేసి రెడీ అయ్యాం. దగ్గర్లోని బొటానికల్‌ గార్డెన్‌లో డాన్స్‌షో జరుగుతోంది. కథాకళి, మిగతా డాన్స్‌లు లైటింగ్‌లో ఫౌంటెయిన్‌ చాలా అద్భుతంగా వుంది. 17 డిగ్రీలు వున్న చలి రాత్రికి ఇంకా తగ్గింది.
ఉదయం త్వరగా లేచి సూర్యోదయం చూస్తూ అలెప్పీకి బయలుదేరాం. దాదాపు నూటడెబ్బయి కిలోమీటర్లు. నాలుగున్నర గంటలు అని గూగుల్‌ మ్యాప్‌ చూపిస్తుంది. ప్రతి మలుపులో కొండకు పైన ఇళ్లు, ఏటవాలు పై కప్పుతో రకరకాల రంగుల్లో, విదేశాల్లో ఇళ్లలాగా చాలా బాగున్నాయి. మధ్యలో ఆగుదామంటే చాలా ఇరుకు దారి. రెండు వాహనాలు మాత్రమే కదలడానికి అవకాశం వుంది. జలపాతాలు మాత్రం కనువిందు చేస్తూనే వున్నాయి. కొంతదూరం వెళ్లాక ఆగడానికి అవకాశం దొరికింది. అది చాలా పెద్ద జలపాతం. కెమెరాకి చిక్కడం లేదు. అంటే… చాలా ఎత్తులో అద్భుతంగా వుంది. అక్కడికి మన దేశీయులతో పాటు విదేశీయులు కూడా వచ్చారు. అక్కడ చిన్న చిన్న బండ్లలో తినుబండారాలు, ఐస్‌క్రీమ్‌లు, మామిడి ముక్కలు, మొక్కజొన్నలు మొదలైనవి, రకరకాల షాపింగ్‌ క్యాప్‌లు, కీచైన్‌లు వున్నాయి. అది ముగించుకుని ముందుకు కదిలాం. ఎడమవైపు నుండి జలపాతాల నీటితో నది పరవళ్లు తాకుతూ కదులుతుంది. కుడివైపు కొండలు, అతి ఎత్తైన చెట్లు, ఆ చెట్ల నుండి చూస్తే ఆకాశం కనపడడం లేదని ఆశ్చర్యపోయాం. ముందుకు వెళ్తున్న కొద్దీ ఘాట్‌రోడ్డు ఇరుకు అవుతుంది. వాహనాలు విపరీతంగా వెళ్తున్నాయి, వస్తున్నాయి. అలా ముందుకు వెళ్తూ ఒక చిన్న కుటీరంలాంటి హోటల్‌ దగ్గర ఆగాం టిఫిన్‌ కోసం.
వాళ్లు ఇద్దరూ భార్యాభర్తలు. వయసు 60 – 55. మాకు మళయాలం అర్ధం అవుతుంది. వాళ్లకు తెలుగు రాదు. మొత్తానికి ఇంగ్లీష్‌ ద్వారా సంభాషణ కొనసాగించాం. వాళ్లకు ఇంగ్లీషు పూర్తిగా రాకపోయినా వాళ్లు చేసిన టిఫిన్స్‌లోని రకాలు చెప్పారు. అక్కడి వంటకం ఆప్పం ఆర్డర్‌ చేశాం. అప్పం అంటే మన దోశ/ ఊతప్పం మాదిరి వుంది. అందులోకి అండాకర్రీ, కోడిగుడ్డు పులుసును వడ్డించారు. కాఫీ తాగి, వాళ్ల షాపులో మామిడిముక్కల ప్యాకెట్‌, ఉసిరికాయల ప్యాకెట్‌ తీసుకున్నాం. వాటిని అక్కడి వాళ్లు ఉప్పునీళ్లలో నిల్ల వుంచి అమ్ముతారట. ఆరు నెలల వరకు పాడవవని చెప్పారు. ఆ రెండు ప్యాకెట్స్‌ తీసుకుని బయలుదేరాం.
వెళ్లే దారిలో ఎడమవైపు వున్న నది, సడెన్‌గా ఎదురుగా వచ్చింది. దానికి అడ్డంగా వంతెన కట్టారు. పురాతనమైన వంతెన ట్రాఫిక్‌జాం అయ్యింది. ముందునుండి అక్కడి ఎం.ఎల్‌.ఎ గారు కారు దిగి, ట్రాఫిక్‌ను జాగ్రత్తగా మళ్లిస్తున్నారు. మా కారు వంతెన మీదికి వెళ్తున్న సమయంలో అటునుండి టూరిస్టు బస్సు దూసుకుని వస్తుంది. రెండింటికి మధ్య వ్యవధి, 10 సెం.మీ. మా వారు కారు అద్దాన్ని లోపలికి తిప్పితే గానీ బస్సు వెళ్లడానికి దారి దొరకలేదు. ఆ బస్సు వెళ్లాక మాకు భయం తప్పింది. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించాల్సిందే.
కేరళ రాష్ట్రం మరో ప్రత్యేకత గ్రామాలు, పట్టణాలు అన్నీ రోడ్డుని ఆనుకునే వుంటాయి. ఎక్కడ ఏ ఊరు మొదలయ్యిందో ఎక్కడ అంతమయ్యిందో అక్కడి వారికి మాత్రమే తెలుస్తుంది.
మొత్తానికి మున్నార్‌ను దాటినం. ఇంటింటికీ పెరటి తోటలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇంకా చాలా ఔషధమొక్కలు ప్రతి ఇంటికీ దర్శనమిస్తున్నాయి. ఆ ప్రజలు – ప్రకృతి విడదీయరాని బంధంగా కలిసిపోయారు. అనుకున్న సమయం కన్నా రెండు గంటలు ఆలస్యం అయ్యింది ట్రాఫిక్‌ వల్ల. అయినా అస్సలు అలసట లేదు. పల్లెటూరి అందం, పట్టణాల మకరందం అన్నీ మిళితమయ్యాయి. తేనెలాగ కొబ్బరి చెట్లు, కొబ్బరి నూనె, ఔషధ నూనెల గొప్పదనం కాబోలు అక్కడి ప్రజలు సన్నగా నల్లగా వున్నా నాజూగ్గా, నల్లని వత్తైన రింగులు తిరిగిన జుట్టు వారి సొంతం. వారి వృత్తి తోటల పెంకపం, పర్యాటక ప్రాంతాల్లో వ్యాపారాలు సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు కాబట్టి విదేశీయులు ఇప్పటికీ ఆ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
అలప్పికి మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకున్నాం. శర్వన భవన్‌లో భోజనం చేశాం. పాయసం, మజ్జిగచారు, పప్పు, రసం, సాంబార్‌, అప్పడంతో కొబ్బరినూనెతో చేసిన వంటకాలు బాగున్నాయి.
బోట్‌హౌస్‌కు బయలుదేరదామనేసరికి అక్కడ దారికి అడ్డంగా పెద్దకాలువ, దాని నిండా బోట్లు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇంకొకరు వచ్చి రాత్రికి బస చేసే బోట్లు కూడా వున్నాయని వాళ్ల ఆఫీసుకు తీసుకుని వెళ్లాడు. పైన అంతస్తులో సింగిల్‌ బెడ్‌ వున్న బోటుని బుక్‌ చేసుకుని బయలుదేరాం బోటు దగ్గరికి ఒక రోజుకు సరిపడా బట్టలు బ్యాగులో తీసుకుని.
5 కి.మీ. ప్రయాణానికి గంట సమయం పట్టింది. అది పంపానది బ్యాక్‌ వాటర్‌ అని చెప్పారు. ఆ ప్రయాణం మరువలేనిది. మా బోటుతోపాటు చాలా వున్నాయి. కొన్ని వచ్చేవైతే, మరికొన్ని వెళ్లేవి. అదంతా చూస్తుంటే రోడ్డుమీద బస్సుల రాకపోకల లాగా వుంది నీటిలో ఆ ప్రయాణం. సుదూరం వరకు నీళ్లు, కొన్ని చోట్ల మార్గానికి ఇరువైపులా ఇళ్లు. అదంతా చూస్తుంటే అది గ్రామమో లేక ద్వీపమో… ఏమనాలో తెలియలేదు. ఒక దగ్గర బోటును ఆపారు.
ఆ బోటులో అన్ని సౌకర్యాలున్నాయి. కిచెన్‌, బెడ్‌రూం, టి.వి సౌండ్‌ బాక్స్‌లు, డైనింగ్‌ ఏరియా, పైకి వెళ్లడానికి మెట్లు… పైన సోఫా సెట్‌, కుర్చీలతో సకల సౌకర్యంగా వుంది. బోటును నడిపే డ్రైవర్‌ బోటును దగ్గర్లోని ఒక స్థంభానికి కట్టి, వాళ్లింటికి ఒక చిన్న పడవలో వెళ్లాడు డ్రైవర్‌.
అక్కడ ప్రతి ఒక్కరికి చిన్న పడవ వుంది, మనకు బైకు వున్నట్టు. మనకు బస్సులాగా వాళ్లకు స్టీమర్లు వున్నాయి. పిల్లలు మ్యూజిక్‌ పెట్టి డాన్స్‌ వేశారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు. చుట్టూ నీళ్ల మధ్యలో బోటు ఇల్లు భలే వుంది.
కిచెన్‌లోకి వెళ్లి చూస్తే కుక్‌ చికెన్‌ కర్రీ చేశాడు. అక్కడి రైస్‌ (అన్నం) లావుగా వుంది. స్టీమ్డ్‌ రైస్‌. నీళ్లలో వడ్లను ఉడికించి పొట్టు తీసినవి. నేను ఆ రైస్‌తో బగారా చేశాను. చేపల ఫ్రై, పప్పు, చపాతీలతో ఆ రాత్రి భోజనం ప్రారంభించాం. అంతలోకి గాలివానతో పెద్ద వర్షం. చాలా భయమేసింది. ఆ బోటువాళ్లు ‘ఏమీ కాదు, భయపడొద్దు. మేమున్నాం కదా’ అని ధైర్యం చెప్పారు. కొద్ది సేపటికి ఉరుములు, వర్షం తగ్గింది.
మత్య్స కారుల ధైర్యం ఎంతో గొప్పది. ఒక రోజుతో కాదు, జీవితాంతం చేపల వేట వాళ్ల ఆధారం. అప్పుడనుకున్నాను, వాళ్లను భగవంతుడు ఎప్పుడూ కాపాడాలని.
తెలతెలవారుతుండగా పక్షుల అలికిడికి పిల్లలు బయటకు పరుగెత్తారు. నీటిలోని సూర్యుని ప్రతిబింబం, అద్దంలా మెరుస్తుంది. రావద్దని గంగమ్మ, పోనని ఆదిత్య (సూర్యుడు)ల కొట్లాటలాగా నీళ్లలో సూర్యుని ప్రతిబింబం కదులాడుతూ వుంది. పిల్లలు గబగబా స్నానం చేసి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. బోట్ల ప్రయాణం ప్రారంభమయింది. కొంచెం దూరం వెళ్లాక ఆ డ్రైవర్‌ మా పాపకి, బాబుకి కొద్దిసేపు బోటు నడపడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు చూడాలి పిల్లల ఆనందం… కొలవలేం, కొనలేం. దిగేముందు డ్రైవర్‌తో, వంటమనిషితో ఫొటోలు దిగి ధన్యవాదాలు చెప్పాం.
– మాద నాగాంజలి, 96400 98344