నైరుతి రుతుపవనాలు వచ్చేశారు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి వచ్చేశాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో బుధవారం చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నైరుతి ఆగమనంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. నిన్నటిదాకా 45 డిగ్రీలు, వడగాల్పులతో అల్లాడిన ప్రజలు వాతావరణం కూల్‌గా మారడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వర్షాలు ప్రారంభం కావడంతో అన్నదాతలు విత్తనాలు విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే, ఒక్క వర్షానికే కాకుండా భూమి బాగా తడిసిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 370కిపైగా ప్రాంతాల్లో వర్షం కురిసింది. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్‌లో అత్యధికంగా 8.25 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. అదే జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ ఏడు సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. 60 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
పొద్దస్తమానం ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం వర్షంతో చల్లదనాన్ని ఆస్వాదించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బుధవారం రాత్రి 10 గంటల వరకు 60కిపైగా ప్రాంతాల్లో వానపడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడూ, రేపూ ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలకూ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. అయితే, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.