వరి ధాన్యం, సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

Purchase centers for paddy and soya should be opened– ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి 

– ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వరి ధాన్యం, సోయా కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. రైతు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులతో మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు సోయా కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేతికొచ్చిన పంట కళ్ళల్లో  ఉండడంతో  వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎకరానికి ఆరు క్వింటాళ్ల సోయా ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరైంది కాదన్నారు. ఆరు క్వింటాళ్ల కంటే అధికంగా పండిన సోయాను రైతులు దళారులకు అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుందని, ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని  ఎకరాన 10 క్వింటాళ్ల వరకు సోయాను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరి కొద్ది రోజుల్లో వరి ధాన్యం కూడా కోతకొస్తుందనని,  రైతులు వరి కోతలు ప్రారంభించక ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ మొదటి వారంలోనే రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించిందే తప్ప ఆచరణలో చూపించలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో కేవలం 100కు పైగా మాత్రమే కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించి చేతులు దులుపుకుందన్నారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనూ గన్ని సంచులు, రవాణా సౌకర్యం, హమాలీల కొరత కొట్టొచ్చినట్టుగా ఉందని విమర్శించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు రైస్ మిల్ అలాట్మెంట్ కూడా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని గుర్తు చేశారు. గత అనుభవంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తూ రైతులను బ్లాక్ మెయిల్ చేశారన్నారు. క్వింటాలకు 8 నుండి 9 కిలోల తరుగు డిమాండ్ చేసి రైతు గత్యంతరం లేక నష్టపోయి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇచ్చే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ పరిస్థితి ఈ సీజన్ లో కొనసాగకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. రైతు సంఘ ప్రతినిధులతో రెవెన్యూ శాఖ కలిసి కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసే విధంగా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నను  ఎంఎస్పి ధర కన్నా తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులు తరుగు తీసుకొని కొనుగోలు చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ముందస్తుగా పసుపు క్వింటాలుకు రూ.15వేల ధర నిర్ణయించాలని  డిమాండ్ చేశారు. ఎర్ర జొన్నల వ్యాపారులు సిండికేట్ అవతారం ఎత్తి బైబ్యాక్ ఒప్పందాలతో ధర తగ్గితే అదే ధర ఇస్తామని ఒప్పందంలో అంశాన్ని చేర్చకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెరిగిన ధరలను అమలు చేస్తామని హామీ ఉంటే సరిపోతుందని తరుగు లేకుండా ఒప్పందంలో ఉండాలన్నారు. సోయా పంట తడిసిన వాటిని దేశరత్తుగా కొనుగోలు చేయాలని  డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మండల అధ్యక్షులు ఉట్నూర్ బాలయ్య, కార్యదర్శి బి. అశోక్, నాయకులు ఊట్నూరి అశోక్, బాలకిషన్, రాజేశ్వర్, టి.బాలయ్య, నడిపన్న, తదితరులు పాల్గొన్నారు.